LIC : ఎల్‌ఐసీలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు.. తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభం ఇచ్చే టాప్-5 పాలసీలు ఇవే
తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభం ఇచ్చే టాప్-5 పాలసీలు ఇవే

LIC : నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటికీ భారతీయ జీవిత బీమా సంస్థ అంటేనే కొండంత నమ్మకం. భీమా రక్షణతో పాటు, భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడటానికి ఎల్‌ఐసీలో అనేక అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే టాప్-5 ఎల్‌ఐసీ పాలసీల వివరాలు తెలుసుకుందాం.
1. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్
బడ్జెట్ తక్కువగా ఉండి, ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలనుకునే వారికి ఇది ఒక ఆల్ రౌండర్ పాలసీ. ఈ స్కీమ్‌లో మీరు రోజుకు కేవలం రూ.45 లేదా నెలకు రూ.1358 పొదుపు చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఈ చిన్న మొత్తమే భవిష్యత్తులో మెచ్యూరిటీ సమయానికి బోనస్‌లతో కలిపి ఏకంగా రూ.25 లక్షల భారీ ఫండ్‌గా మారుతుంది. దీని కనీస కాలపరిమితి 15 ఏళ్లు. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా లైఫ్ కవర్ కొనసాగడం దీని ప్రత్యేకత.
2. ఎల్‌ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్
అస్సలు రిస్క్ వద్దు, నా డబ్బుకు గ్యారెంటీ రిటర్న్స్ కావాలి అనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇది ఒక లో-రిస్క్ ప్లాన్. పెట్టుబడి భద్రతతో పాటు, ఇందులో మీకు లైఫ్ ఇన్సూరెన్స్, కంపెనీ ఇచ్చే బోనస్‌లు కూడా లభిస్తాయి. దీర్ఘకాలిక పొదుపు అలవాటు ఉన్నవారికి ఇది ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుంది.
3. ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి
ఎక్కువ ఆదాయం ఉండి, కోట్లాది రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలనుకునే ధనవంతుల కోసం ఈ ప్రీమియం ప్లాన్ రూపొందించబడింది. ఇందులో కనీస హామీ మొత్తం రూ.1 కోటి. దీని ప్రత్యేకత ఏంటంటే.. తక్కువ కాలం ప్రీమియం కట్టి, ఎక్కువ కాలం లాభాలు పొందవచ్చు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే, కేవలం 4 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కానీ లాభాలు మాత్రం 20 ఏళ్ల వరకు అందుతాయి.
4. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్
రిటైర్మెంట్ తర్వాత డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకూడదు అనుకునే వారికి ఇది ఒక లైఫ్ టైమ్ ఇన్కమ్ ప్లాన్. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత, మీరు ఎంచుకున్న హామీ మొత్తంలో ప్రతి ఏడాది 8% గ్యారెంటీడ్ మనీబ్యాక్ లభిస్తుంది. ఈ ఆదాయం మీకు వంద ఏళ్ల వరకు అందుతుంది. దురదృష్టవశాత్తు పాలసీదారుడు మరణిస్తే, నామినీకి పూర్తి భీమా సొమ్ము అందుతుంది.
5. ఎల్‌ఐసీ జీవన్ తరుణ్
పిల్లల ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం తల్లిదండ్రులు చేసే పొదుపుకు ఇది ఒక భద్రతా కవచం. ఈ ప్లాన్ పిల్లలకి 25 ఏళ్లు వచ్చే వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు, అంటే కెరీర్ ప్రారంభ దశలో వారికి ఏటా మనీబ్యాక్ రూపంలో డబ్బులు అందుతాయి. పాలసీ ముగిశాక ఒకేసారి పెద్ద మొత్తంలో బోనస్‌తో కూడిన నగదు చేతికి వస్తుంది.

