Bank Charges : మినిమం బ్యాలెన్స్ మాత్రమే కాదు.. ఈ ఛార్జీలతోనూ బ్యాంకులు భారీగా సంపాదిస్తాయి
ఈ ఛార్జీలతోనూ బ్యాంకులు భారీగా సంపాదిస్తాయి

Bank Charges : దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ పరిమితిని రూ.50,000కు పెంచింది. దీంతో సోషల్ మీడియాలో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో బ్యాంక్ సామాన్య ప్రజలకు దూరం అవుతోందని చాలామంది విమర్శిస్తున్నారు. అయితే, బ్యాంక్‌లు కనీస బ్యాలెన్స్ లేనప్పుడు మాత్రమే కాకుండా, ఇంకా ఏయే పద్ధతులలో భారీగా ఆదాయం సంపాదిస్తాయో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ ఉదాహరణే తీసుకుంటే, బ్యాంక్ పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్‌లలో మినిమం బ్యాలెన్స్ పరిమితిని వేర్వేరుగా మార్చింది. ఈ పరిమితిని పాటించని వారికి వేర్వేరు జరిమానాలు విధిస్తారు. పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ పరిమితిని పాటించని వారికి రూ.100 తో పాటు, లోపించిన బ్యాలెన్స్‌లో 5% ఛార్జీ విధిస్తారు. గ్రామీణ బ్రాంచ్‌లలో కనీస బ్యాలెన్స్ మొత్తంలో 5% జరిమానా విధిస్తారు. మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే, బ్యాంక్ ప్రతి నెలా జరిమానా వసూలు చేస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్‌లలో ఈ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ ఖాతా చాలా నెలలు నిష్క్రియంగా ఉంటే, దానికి కూడా బ్యాంక్ నాన్-ఆపరేషనల్ ఛార్జీ వసూలు చేయవచ్చు.
బ్యాంక్‌లు వసూలు చేసే ఇతర ఛార్జీలు
మినిమం బ్యాలెన్స్ మాత్రమే కాకుండా, బ్యాంక్‌లు ఇంకా చాలా పద్ధతులలో కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేస్తాయి.
ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు: చాలా బ్యాంక్‌లు నెలకు 4-5 ఉచిత విత్‌డ్రాలను అందిస్తాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.20-రూ.50 వరకు ఛార్జ్ చేస్తాయి. మీరు వేరే బ్యాంక్ ఏటీఎం వాడినట్లయితే ఈ ఛార్జీ మరింత పెరుగుతుంది.
డెబిట్ కార్డ్ ఫీజు: డెబిట్ కార్డుల కోసం బ్యాంక్‌లు సంవత్సరానికి రూ.100 నుంచి రూ.500 వరకు మెయింటెనెన్స్ ఫీజు వసూలు చేస్తాయి.
ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు: ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు కూడా బ్యాంక్‌లు ఛార్జ్ చేస్తాయి. ప్రతి మూడు నెలలకోసారి ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లకు రూ.15-రూ.20 వరకు కట్ చేయవచ్చు.
చెక్‌బుక్: చెక్‌బుక్‌లో కొన్ని ఉచిత పేజీల తర్వాత, అదనపు చెక్కులకు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
ఆన్‌లైన్ లావాదేవీలు: నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ వంటి పెద్ద మొత్తాల ఆన్‌లైన్ లావాదేవీలకు కూడా కొన్నిసార్లు ఛార్జీలు వసూలు చేస్తారు.
బ్యాంక్‌లు వసూలు చేసే ఈ చిన్న చిన్న ఛార్జీలు ఒక్కో కస్టమర్‌కు పెద్దగా అనిపించకపోయినా, లక్షలాది ఖాతాదారుల నుంచి ఈ మొత్తం బ్యాంకులకు కోట్ల రూపాయల ఆదాయంగా మారుతుంది.
