భారత్ టాక్సీ యాప్ ధాటికి ప్రైవేట్ దిగ్గజాలు బెంబేలు

Bharat Taxi App : క్యాబ్ బుక్ చేసుకోవాలంటే చాలు.. ఓలా, ఉబర్ యాప్స్‌లో కిరాయిలు చూసి సామాన్యుడి గుండె గుభేల్ మనేది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో సర్జ్ ప్రైసింగ్ పేరుతో కంపెనీలు వసూలు చేసే అదనపు బాదుడు అంతా ఇంతా కాదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం సహకార నమూనాలో భారత్ టాక్సీ యాప్ సేవలను ప్రారంభించింది. ఈ నెలలోనే ఢిల్లీలో మొదలైన ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించనున్నాయి. ఇది ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, వినియోగదారులకు 30 శాతం వరకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

డ్రైవర్ల ఆదాయానికి అండగా..

సాధారణంగా ఓలా, ఉబర్ లేదా రాపిడో వంటి యాప్స్ ప్రతి రైడ్‌పై డ్రైవర్ సంపాదన నుంచి 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తాయి. దీంతో రోజంతా కష్టపడినా డ్రైవర్ల చేతికి వచ్చేది చాలా తక్కువ. కానీ భారత్ టాక్సీ యాప్ జీరో కమిషన్ లేదా అతి తక్కువ ఫీజు మోడల్‌పై పనిచేస్తుంది. దీనివల్ల డ్రైవర్లకు తమ సంపాదనలో 80 నుంచి 100 శాతం వాటా దక్కుతుంది. ఇది వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, ప్రైవేట్ కంపెనీలపై వారి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. డ్రైవర్లకు కేవలం ఆదాయమే కాకుండా, ఈ సహకార సంస్థలో భాగస్వామ్యం కూడా లభించడం విశేషం.

కస్టమర్లకు సర్జ్ ప్రైసింగ్ టెన్షన్ ఉండదు

భారత్ టాక్సీ యా మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇందులో డైనమిక్ ప్రైసింగ్ లేదా సర్జ్ ప్రైసింగ్ ఉండదు. అంటే వర్షం పడినా, రద్దీగా ఉన్నా కిరాయి పెరగదు. ధరలు ఎప్పుడూ పారదర్శకంగా, స్థిరంగా ఉంటాయి. ప్రైవేట్ యాప్స్‌లో డిమాండ్ పెరిగినప్పుడు కిరాయిలు రెట్టింపు అవ్వడం చూస్తుంటాం, కానీ భారత్ యాప్‌లో అలాంటి దోపిడీకి తావులేదు. దీంతో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో, ఎటువంటి గందరగోళం లేకుండా తమ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు.

ప్రైవేట్ కంపెనీల ఆగడాలకు చెక్

ఈ యాప్ రాకతో ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లకు గట్టి సవాల్ ఎదురవుతోంది. డ్రైవర్లు అధిక కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో, వారు ఈ ప్రభుత్వ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఓలా, ఉబర్‌లు తమ కమిషన్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో విజయవంతంగా నడుస్తున్న ఈ మోడల్, త్వరలోనే హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కూడా రానుంది. తక్కువ కమిషన్, స్థిరమైన కిరాయి, డ్రైవర్ల సాధికారత.. ఈ మూడు సూత్రాలతో భారత్ టాక్సీ యాప్ క్యాబ్ రంగంలో విప్లవం సృష్టించబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story