Health Card : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, త్వరలో పదవీ విరమణ చేయబోతున్న వారికి మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS) పెన్షనర్ కార్డ్‌ను పొందే ప్రక్రియను కేంద్రం మరింత సరళతరం చేసింది. దీని కోసం రిటైర్ అయ్యే ఉద్యోగులు ఇకపై వేర్వేరు పోర్టళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం గానీ, ప్రతిసారీ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన పని గానీ ఉండదు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిజిహెచ్‌ఎస్ (CGHS) ఆన్‌లైన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పోర్టల్ అయిన భవిష్యతో అనుసంధానించింది. ఈ సరికొత్త నిర్ణయంతో పెన్షనర్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

భవిష్య పోర్టల్ ద్వారా సులువైన దరఖాస్తు ప్రక్రియ

సాధారణంగా కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్, పెన్షన్ సంబంధిత పనుల కోసం భవిష్య పోర్టల్‌ను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ నుంచే నేరుగా సిజిహెచ్‌ఎస్ పెన్షనర్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు సిస్టమ్‌లను ఒకేచోటకు చేర్చడం వల్ల ఉద్యోగికి సంబంధించిన సేవలు, పెన్షన్ వివరాలు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. దీనివల్ల ఉద్యోగులు మళ్లీ మళ్లీ అవే వివరాలను పూరించడం లేదా పేపర్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది పేపర్‌లెస్ డిజిటల్ విధానంలో వేగంగా పూర్తవుతుంది.

రిటైర్మెంట్ అయిన వెంటనే వైద్య సేవలు అందుబాటులోకి..

ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా ఆరోగ్య సేవలు పొందేలా చూడటమే ఈ డిజిటల్ అనుసంధాన ప్రధాన లక్ష్యం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరిశీలన (వెరిఫికేషన్) మరియు అనుమతి (అప్రూవల్) ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి. నిర్ణీత విరాళం చెల్లించిన వెంటనే పెన్షనర్లు తమ CGHS కార్డును ఆన్‌లైన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ అయిన మరుసటి రోజు నుంచే ఆసుపత్రుల్లో ఉచిత లేదా రాయితీ వైద్య సేవలను పొందే వెసులుబాటు లభిస్తుంది.

డిజిటల్ గవర్నెన్స్ & ఆలస్యానికి చెక్

కేంద్ర ప్రభుత్వ ఈజ్ ఆఫ్ లివింగ్, డిజిటల్ గవర్నెన్స్ విధానాల్లో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. భవిష్య పోర్టల్‌లో ఇప్పటికే ఉద్యోగులకు ePPO, పెన్షన్ స్లిప్, ఫారమ్-16, లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు CGHS కార్డు సేవలు కూడా తోడవడంతో రిటైర్మెంట్ సేవలకు ఇది ఒకే ఒక డిజిటల్ వేదికగా మారనుంది. ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యే వేలాది మంది కేంద్ర ఉద్యోగులకు దీనివల్ల సమయం కలసిరావడమే కాకుండా, దరఖాస్తుల్లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా తగ్గుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story