NPS Account : దేశంలో ఉద్యోగులు, సామాన్య ప్రజల రిటైర్మెంట్ ప్లానింగ్‌ను అత్యంత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద డిజిటల్ మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా తెరవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం కానీ, పెద్ద పెద్ద ఆన్‌లైన్ ఫారాలు నింపాల్సిన అవసరం కానీ ఉండదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సంయుక్తంగా కలిసి మొబైల్‌లోని భీమ్ యాప్ ద్వారానే నిమిషాల్లో ఎన్‌పీఎస్ ఖాతా తెరిచే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.

మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరం లేదు

ఈ సరికొత్త డిజిటల్ సిస్టమ్ వల్ల పేపర్‌లెస్, ఎటువంటి ఇబ్బందులు లేని అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ సాధ్యమవుతుంది. సాధారణంగా ఏదైనా ఒక పొదుపు పథకంలో చేరాలంటే కొత్తగా నో యువర్ కస్టమర్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆధార్, పాన్ కార్డు వంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో, మీ భీమ్ యాప్‌కు లింక్ అయి ఉన్న మీ బ్యాంక్ ఖాతా కేవైసీ వివరాలనే ఈ ఎన్‌పీఎస్ అకౌంట్ కోసం కూడా నేరుగా ఉపయోగించుకుంటారు. దీనివల్ల డిజిటల్ విషయాలపై పెద్దగా అవగాహన లేని వారు కూడా కేవలం కొన్ని క్లిక్‌లతోనే తమ పెన్షన్ అకౌంట్‌ను ప్రారంభించుకోవచ్చు.

పీఎఫ్ డబ్బు నేరుగా ఎన్‌పీఎస్‌కు బదిలీ

ప్రస్తుత ఆర్థిక నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) కింద వచ్చే ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ (EPS), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) రెండు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లుగా పనిచేస్తున్నాయి. వీటి మధ్య నేరుగా డబ్బు బదిలీ చేసుకునే సదుపాయం ఇప్పటివరకు లేదు. అయితే ప్రభుత్వం ఈ రెండు వ్యవస్థల మధ్య పోర్టబిలిటీని కల్పిస్తూ చట్టపరమైన సవరణలు చేయడానికి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే, ఉద్యోగులు తమ పీఎఫ్ లోని పెన్షన్ డబ్బును నేరుగా ఎన్‌పీఎస్ అకౌంట్‌కు షిఫ్ట్ చేసుకునే వీలు కలుగుతుంది.

ఎక్కువ రిటర్న్స్ పొందేందుకు అద్భుతమైన ఛాన్స్

ఈ కొత్త పోర్టబిలిటీ నిబంధన అమలులోకి వస్తే, ఉద్యోగులు తమ పెట్టుబడులపై మెరుగైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రస్తుత ఈపీఎస్ లో జమ అయ్యే డబ్బుపై ప్రభుత్వం నిర్ణయించిన ఒక స్థిరమైన వడ్డీ మాత్రమే వస్తుంది. కానీ ఎన్‌పీఎస్ అనేది మార్కెట్ ఆధారిత పథకం కావడం వల్ల, షేర్ మార్కెట్ పనితీరు ఆధారంగా భారీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్‌పీఎస్ లో 100 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. కాబట్టి దీర్ఘకాలంలో సాంప్రదాయ పొదుపు పథకాల కంటే ఎన్‌పీఎస్ లోనే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. పైగా ఇందులో 60 ఏళ్ల తర్వాత కూడా 85 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పెట్టుబడులను కొనసాగించవచ్చు.

గిగ్ వర్కర్లు, చిన్న వ్యాపారులకు ఆర్థిక రక్షణ

ఈ డిజిటల్ మార్పుల వల్ల అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న దుకాణదారులు, ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్లకు (డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు మొదలైనవారు) అత్యంత ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఈ వర్గాల వారికి ఉద్యోగ విరమణ తర్వాత ఎటువంటి సామాజిక భద్రత లేదా రెగ్యులర్ పెన్షన్ వచ్చే మార్గాలు ఉండవు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే భీమ్ యాప్ లాంటి నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌లో ఈ సదుపాయం రావడం వల్ల, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సామాన్యులు కూడా తమకు తోచిన చిన్న మొత్తాలను పొదుపు చేసుకుంటూ వృద్ధాప్యానికి పెద్ద మొత్తంలో ఫండ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story