BHIM App : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన స్వదేశీ పేమెంట్ యాప్ భీమ్ మార్కెట్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఫోన్‌పే, గూగుల్ పేల హవా నడుస్తున్న సమయంలో సైలెంట్‌గా తన వ్యూహాలను మారుస్తూ యూజర్లను ఆకట్టుకుంది. ఎన్‌పిసిఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 2024 లో కేవలం 23 మిలియన్లుగా ఉన్న భీమ్ యాప్ నెలవారీ యూపీఐ లావాదేవీలు జూన్ 2026 నాటికి ఏకంగా 224 మిలియన్లకు చేరుకున్నాయి. అంటే రెండేళ్ల వ్యవధిలోనే లావాదేవీల సంఖ్య దాదాపు పది రెట్లు పెరిగింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ కూడా రూ. 7,966 కోట్ల నుంచి రూ. 25,613 కోట్లకు పెరిగి మూడు రెట్లకు పైగా రికార్డు నమోదు చేసింది.

కార్పొరేట్ పునర్నిర్మాణంతో మారిన దశ

ఒకప్పుడు యూపీఐ రంగంలో దాదాపు 40 శాతం వాటాతో ఏకఛత్రాధిపత్యం వహించిన భీమ్, ఆ తదుపరి కాలంలో విదేశీ కంపెనీల దాటికి తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. అయితే 2024లో ఎన్పీసీఐ ఈ యాప్‌ను ఒక ప్రత్యేక సబ్సిడరీగా (NPCI BHIM Services Ltd) మార్చి, స్వతంత్రంగా పనిచేసే వెసులుబాటును కల్పించడంతో దీని దశ తిరిగింది. సంస్థలో రూ. 300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం, యూజర్ల కోసం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పెంచడం మరియు ఇంటర్‌ఫేస్‌ను సులభతరం చేయడంతో మళ్లీ కస్టమర్లు భీమ్ వైపు మొగ్గు చూపారు. 'భారత్ సొంత పేమెంట్ యాప్' అనే బ్రాండింగ్ కూడా దీనికి బాగా కలిసివచ్చింది.

డిజిటల్ గోల్డ్, క్రెడిట్ ఉత్పత్తుల వైపు బిగ్ ప్లాన్

కేవలం యూపీఐ చెల్లింపులకే పరిమితం కాకుండా, భీమ్ యాప్ ఇప్పుడు ఆర్థిక సేవల విభాగంలోకి అడుగుపెట్టేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో డిజిటల్ గోల్డ్, పర్సనల్ క్రెడిట్, క్రెడిట్ కార్డు ఉత్పత్తులను ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చెల్లింపులు, డిబిటి, స్వయం సహాయక సంఘాల (SHG) స్థాయిలలో ఇంకా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు భీమ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ లలితా నటరాజ్ వెల్లడించారు. అలాగే ఇతర బ్యాంకుల యాప్‌లతో కలిసి పనిచేసే విధంగా కెనరా వంటి బ్యాంక్‌లతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు.

పోటీలో మిగిలిన చిన్న యాప్‌ల జోరు

కేవలం భీమ్ మాత్రమే కాకుండా మిగిలిన చిన్న తరహా యూపీఐ యాప్‌లు కూడా మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. వాట్సాప్ పే జూన్ 2026 లో 150 మిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసి, CRED ను వెనక్కి నెట్టి ఎనిమిదవ అతిపెద్ద యాప్‌గా నిలిచింది. మరోవైపు నవీ, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సూపర్ మనీ యాప్‌లు కూడా మార్కెట్‌లో తమ వాటాను వేగంగా పెంచుకుంటున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పేలు దాదాపు 79 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నప్పటికీ, ఈ చిన్న యాప్‌ల పుంజుకోలు యూపీఐ విభాగంలో కొత్త పోటీకి తెరలేపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story