ఒక్క నంబర్ కొడితే చాలు..జాతకం మొత్తం బయటపడాల్సిందే

Bhu-Aadhaar : దేశ రాజధాని ఢిల్లీలో భూముల వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనుషులకు మాత్రమే ఉన్న ఆధార్ గుర్తింపును, ఇకపై ఢిల్లీలోని ప్రతి అంగుళం భూమికి కూడా వర్తింపజేయనున్నారు. దీనినే భూ ఆధార్ లేదా ULPIN (Unique Land Parcel Identification Number) అని పిలుస్తారు. భూ రికార్డుల్లో పారదర్శకతను పెంచడం, భూ కబ్జాలు, వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

14 అంకెలతో భూమికి కొత్త గుర్తింపు

ఢిల్లీలోని ప్రతి భూమికి లేదా ప్లాట్‌కు 14 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. దీనివల్ల భూమి అసలు యజమాని ఎవరు? ఆ భూమి విస్తీర్ణం ఎంత? దాని సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలన్నీ డిజిటల్ రూపంలో ఒకే నంబర్‌తో లభిస్తాయి. భూ వివాదాల్లో చిక్కుకుని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఈ భూ ఆధార్ ఒక పెద్ద ఊరటనిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రయోగిస్తున్న డిజిటల్ అస్త్రమని ఆమె అభివర్ణించారు.

మిషన్ మోడ్‌లో అమలవుతున్న కేంద్ర పథకం

నిజానికి ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016లోనే ప్రతిపాదించింది. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఢిల్లీలో ఇది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు సీఎం రేఖా గుప్తా ప్రభుత్వం దీనిని మిషన్ మోడ్‎లో చేపట్టింది. రెవెన్యూ శాఖలోని ఐటీ విభాగం ఈ బాధ్యతను తీసుకుంది. సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ ఢిల్లీలోని తిలంగ్‌పూర్ కోట్లా గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 274 భూ ఆధార్ కార్డులను విజయవంతంగా సిద్ధం చేశారు.

డ్రోన్ సర్వేలు.. హై-క్వాలిటీ డేటా

భూముల సరిహద్దుల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని వాడుతోంది. సర్వే ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన దాదాపు 2 టెరాబైట్ల హై-క్వాలిటీ డేటా, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ (డ్రోన్ ద్వారా తీసిన ఖచ్చితమైన ఫోటోలు) ఆధారంగా మ్యాపింగ్ జరుగుతోంది. దీనివల్ల ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం లేదా ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేయడం వంటి అక్రమాలకు తావుండదు. గ్రామీణ ప్రాంతాల్లోని 48 గ్రామాలను మొదటి విడతలో ఈ పథకం కింద కవర్ చేస్తున్నారు.

మోదీ డిజిటల్ ఇండియా దారిలో ఢిల్లీ

ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ అయిన డిజిటల్ ఇండియా దిశగా ఇది ఒక విప్లవాత్మక అడుగు అని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కొనియాడారు. సాంకేతికత ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందాలన్నదే ప్రధాని ఆకాంక్ష అని, భూ ఆధార్ ద్వారా సామాన్యుడి ఆస్తికి పూర్తి భద్రత లభిస్తుందని ఆమె అన్నారు. అవినీతిపై నేరుగా దెబ్బ కొట్టేందుకు, ఆధునిక భూ రికార్డులే పునాది అని ఆమె నొక్కి చెప్పారు. ఇకపై భూమి వివరాల కోసం వేర్వేరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, ఈ 14 అంకెల కోడ్‌తో మొత్తం జాతకం బయటపడుతుందని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story