New Rules: అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితి తగ్గడంతో పాటు ఎల్‌పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. యూపీఐ మార్పులు, ట్యాక్స్ ఆడిట్ గడువు పెంపు, రైల్వే తనిఖీలతో పాటు సామాన్యుడి దైనందిన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపే ముఖ్యమైన మార్పుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. ఎస్‌బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఇతర బ్యాంకు ఏటీఎంలలో లభించే ఉచిత లావాదేవీల సంఖ్య పది నుంచి ఐదుకు తగ్గింది. ఇందులో ఫైనాన్షియల్ అలాగే నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు రెండు వర్తిస్తాయి. ఈ ఐదు ఉచిత పరిమితి ముగిసిన తర్వాత ప్రతి విత్‌డ్రాయల్‌పై రూ.23తో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు నాలుగు ఉచిత విత్‌డ్రాయల్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.15 ఛార్జ్ వర్తిస్తుంది.

2. ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్లకు బయోమెట్రిక్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు సబ్సిడీ ధరకు సిలిండర్ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేశారు. ఈ వెరిఫికేషన్ చేయించుకోని వారు ఎప్పటిలాగే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు, అయితే సబ్సిడీ డబ్బులు రావు. మార్కెట్ ధర పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

3. యూపీఐ లావాదేవీల కొత్త మర్చంట్ నిబంధనలు

డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు సంబంధించిన కొత్త మార్పులు రాబోతున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 పైబడిన నిర్దిష్ట వ్యాపార మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జ్ వర్తిస్తుంది. అయితే సాధారణ ప్రజలు, కస్టమర్లపై ఈ భారం ఉండదు. ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు నేరుగా జరిపే సాధారణ పర్సన్-టు-పర్సన్ యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి.

4. ఎన్‌పీఎస్ ఛార్జీలు అలాగే ట్యాక్స్ గడువు పెంపు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సవరించిన ఫీజుల నిర్మాణం అమల్లోకి వచ్చింది. ప్రతి పీఆర్ఏఎన్ ఖాతాకు వన్-టైమ్ ఆన్‌బోర్డింగ్ ఛార్జ్ కింద రూ.200 వర్తిస్తుంది. అలాగే అసెస్‌మెంట్ ఇయర్ సంబంధించి ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు సమర్పించే చివరి తేదీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు. ఇన్‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువును నవంబర్ 21 వరకు పెంచారు.

5. ఆస్తి కొనుగోలుదారులకు ఊరట

నాన్-రెసిడెంట్ విక్రేతల నుంచి స్థిరాస్తులు కొనుగోలు చేసే వ్యక్తులు ఇకపై టీడీఎస్ కోసం ప్రత్యేకంగా టాన్ తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం తమ పాన్ కార్డు నంబర్ ద్వారానే ఆ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మరోవైపు ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను పనిదినాల్లో ప్రతిరోజూ ఉదయం 10:10 గంటలకల్లా అధికారిక వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి.

6. రైల్వే తనిఖీలు అలాగే పీయూసీసీ లేకపోతే ఇంధనం బంద్:

సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రత్యేక టికెట్ తనిఖీ ప్రచారాన్ని ప్రారంభమైంది. కన్సెషన్ టికెట్లు, రిజర్వేషన్ కోటా, రైల్వే పాస్‌లపై ప్రయాణించేవారు ఒరిజినల్ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలి. మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సరైన పీయూసీసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ విక్రయించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా దీనిని పర్యవేక్షిస్తున్నారు.

Next Story