EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. నెలనెలా డబ్బులు విత్‌డ్రా చేసుకున్నా ట్యాక్స్ ఉండదు
నెలనెలా డబ్బులు విత్‌డ్రా చేసుకున్నా ట్యాక్స్ ఉండదు

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో పీఎఫ్ ఖాతాదారుల కోసం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఆప్షన్‌కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానం ద్వారా విడతల వారీగా తీసుకునే డబ్బుపై పన్ను పడుతుందా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. ఈ గందరగోళానికి తెరదించుతూ, SWP ద్వారా వచ్చే మొత్తాన్ని పూర్తిగా ట్యాక్స్-ఫ్రీ చేయాలని కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీనికోసం 'ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025' లో అవసరమైన సవరణలు చేయాలని కోరుతూ త్వరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించనుంది.
ఏమిటీ కొత్త SWP విధానం? ఎలా పనిచేస్తుంది?
నవంబర్ 19, 2026న జరిగిన సమావేశంలో రిటైర్ అయ్యే ఉద్యోగుల కోసం EPFO ఈ కొత్త SWP సదుపాయాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకుంటారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. ఇప్పుడు కొత్త SWP ఆప్షన్ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి కాకుండా నెలవారీ, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చొప్పున క్రమపద్ధతిలో తీసుకోవచ్చు. ఇలా విత్‌డ్రా చేయగా ఖాతాలో మిగిలి ఉన్న బ్యాలెన్స్‌పై యథావిధిగా వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఒకేసారి తీసుకున్న డబ్బుకు ఉన్నట్లే, ఈ SWP విత్‌డ్రాయల్స్‌కు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని కార్మిక శాఖ కోరుతోంది.
రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ కట్టే అవకాశం
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తన EPF ఖాతాలో కొత్తగా డబ్బులు జమ చేయడానికి వీలులేదు. కానీ, పదవీ విరమణ తర్వాత కూడా సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూషన్ కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని CBT ప్రతిపాదించింది. ఒకవేళ రిటైర్మెంట్ తర్వాత డబ్బులు కడితే, దానిపై వచ్చే వడ్డీకి పన్ను నిబంధనలు ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ వడ్డీ మొత్తానికి కూడా పూర్తిగా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక శాఖను కోరేందుకు కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుని అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.
సభ్యుడు మరణిస్తే నామినీకి ఉండే వెసులుబాటు ఇదే
SWP విధానం కింద నెలవారీ లేదా త్రైమాసిక వాయిదాలు తీసుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తు పీఎఫ్ సభ్యుడు మరణిస్తే, వారి కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. అలాంటి పరిస్థితుల్లో నామినీ లేదా చట్టపరమైన వారసులకు రెండు ఆప్షన్లు ఉంటాయి. వారు కావాలనుకుంటే పీఎఫ్ ఖాతాలో మిగిలి ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు, లేదా సభ్యుడిలాగే వాయిదాల పద్ధతిలో కొనసాగించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తే వృథా ఖర్చులు అవుతాయని భావించే ఉద్యోగులకు, క్రమమైన ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం ఎంతో మేలు చేయనుంది.

