ఈ వారంలోనే మీ అకౌంట్లోకి వడ్డీ డబ్బులు!

EPFO : ఉద్యోగం చేస్తూ జీతం నుంచి ప్రోవిడెంట్ ఫండ్ కట్‌ అవుతున్న వాళ్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఈ వారంలోనే మీ పీఎఫ్ ఖాతాలోకి వడ్డీ డబ్బులను జమ చేయబోతోంది. ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా కీలక ప్రకటన చేశారు. ఈ వార్త లక్షలాది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ సభ్యుల ఖాతాల్లో 8.25 శాతం వడ్డీని జమ చేసే ప్రక్రియను ఈ వారంలోనే పూర్తి చేయనుంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఈపీఎఫ్ఓ తన సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని జమ చేస్తుంది.

ఈ సంవత్సరం మొత్తం 33.56 కోట్ల మంది సభ్యులు కలిగిన 13.88 లక్షల సంస్థల వార్షిక పీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేయాల్సి ఉందని తెలిపారు. జూలై 8 నాటికి, ఇప్పటికే 13.86 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేయబడింది. అంటే, దాదాపు 99.9 శాతం సంస్థలు, 96.51 శాతం మంది సభ్యుల పీఎఫ్ ఖాతాలను అప్‌డేట్ చేసే పని పూర్తయ్యిందన్నమాట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తాలపై 8.25 శాతం వడ్డీ రేటును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం 2025 మే 22న ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే, 2025 జూన్ 6 రాత్రి నుంచే ఈపీఎఫ్ఓ వడ్డీ మొత్తాన్ని పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే పనిని ప్రారంభించింది.

గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వడ్డీ జమ ప్రక్రియ ఆగస్టులో మొదలై డిసెంబర్‌లో పూర్తయిందని కార్మిక మంత్రి గుర్తు చేశారు. అయితే, ఈసారి ప్రక్రియను మరింత వేగవంతం చేశారని, దాని వల్ల ఎక్కువ భాగం పని జూన్‌లోనే పూర్తయిందని ఆయన వివరించారు. మిగిలి ఉన్న సంస్థల వార్షిక ఖాతాలను కూడా ఈ వారం లోపే అప్‌డేట్ చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ఓ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని 2025 ఫిబ్రవరి 28న నిర్ణయించింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపింది. ఈ వడ్డీ రేటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన వడ్డీ రేటుతో సమానంగానే ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story