Inflation : లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. డిసెంబర్లో ఈఎంఐలు తగ్గుతాయా ?
డిసెంబర్లో ఈఎంఐలు తగ్గుతాయా ?

Inflation : సామాన్య ప్రజలకు ఇది అతిపెద్ద శుభవార్త. కొద్ది నెలలుగా ఆకాశాన్నంటుతున్న ధరలు ఒక్కసారిగా నేలకు దిగివచ్చాయి. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఊహించని విధంగా రికార్డు స్థాయికి పడిపోయింది. ఇది ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకోవాలనుకునేవారికి ఇప్పటికే ఈఎంఐలు కడుతున్న వారికి తీపి కబురు అందించేలా ఉంది. ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు గట్టిగా అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మన లోన్లపై వడ్డీ భారం తగ్గడం ఖాయం.
అక్టోబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం విడుదలయ్యాయి. ఆర్థిక నిపుణుల అంచనాలను మించి, ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25% శాతానికి పడిపోయింది. సెప్టెంబర్ నెలలో ఇది 1.44%గా ఉంది. వినియోగదారుల ధరల సూచీ సిరీస్ చరిత్రలో ఇదే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం కావడం విశేషం. ముఖ్యంగా, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు బాగా తగ్గడం, అలాగే ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నెమ్మదించడం వల్లే ఇది సాధ్యమైంది.
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం, ద్రవ్యోల్బణం తగ్గడానికి మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి:
* ఆహార ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గడం.
* గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం.
* ప్రభుత్వం ఇటీవల చేసిన GST సంస్కరణలు.
ఈ కారణాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2.5% మాత్రమే ఉండవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. (గత ఏడాది ఇది 4.6%గా ఉంది). జీఎస్టీ సంస్కరణల పూర్తి ప్రయోజనం నవంబర్ నెలలో మరింత ఎక్కువగా కనిపిస్తుందని, నవంబర్‌లో ద్రవ్యోల్బణం 0.9% ఉండవచ్చని తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇది 2% కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది.
వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఆర్‌బీఐ సిద్ధం?
ధరలు అదుపులో ఉండటమే లక్ష్యంగా పనిచేసే ఆర్‌బీఐకి ఇది పెద్ద ఊరట. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ, గతంలో అక్టోబర్, ఆగస్టు నెలల్లో వడ్డీ రేట్లను (రెపో రేటు) 5.5% వద్ద స్థిరంగా ఉంచింది. ఆ సమయంలో అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల ప్రభావం వంటి అంశాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపాయి.
కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో, వడ్డీ రేట్లను తగ్గించాలన్న ఒత్తిడి ఆర్‌బీఐపై బలంగా ఉంది. డిసెంబర్‌లో జరగబోయే సమావేశంలో ఆర్‌బీఐ కచ్చితంగా రెపో రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటుందని, తద్వారా హోమ్ లోన్‌లు, కార్ లోన్‌లు, ఇతర బిజినెస్ లోన్‌లు చౌకగా లభిస్తాయని మార్కెట్ వర్గాలు గట్టిగా ఆశిస్తున్నాయి.

