70,000 కోట్ల దోపిడీ వెనుక సాఫ్ట్‌వేర్ మాయ

Biryani Tax Scam : మీరు ఎప్పుడైనా హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిన్న తర్వాత బిల్లును క్యాష్ రూపంలో చెల్లించారా? అయితే ఆ బిల్లు ప్రభుత్వ రికార్డుల నుంచి మాయమైపోయి ఉండవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. మీరు చెల్లించిన నగదు హోటల్ యజమానుల జేబుల్లోకి వెళ్తోంది తప్ప, ప్రభుత్వానికి అందాల్సిన పన్ను రూపంలో చేరడం లేదు. ఆదాయపు పన్ను శాఖ జరిపిన తాజా సోదాల్లో ఏకంగా 70,000 కోట్ల రూపాయల భారీ పన్ను కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం బిర్యానీ బిల్లులను సిస్టమ్ నుంచి డిలీట్ చేయడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ఈ స్కామ్ వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. సాధారణంగా హోటళ్లలో మనం కార్డ్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే బ్యాంక్ రికార్డులు ఉంటాయి కాబట్టి వాటిని దాచడం కష్టం. కానీ నగదు రూపంలో ఇచ్చే పేమెంట్లను దాచేందుకు ఒక ప్రత్యేకమైన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‎ను వీరు వాడుతున్నారు. రోజంతా కస్టమర్లు చేసిన ఆర్డర్ల బిల్లులు పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్‌లో నమోదవుతాయి. అయితే, ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే ముందు, హోటల్ నిర్వాహకులు ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా కేవలం నగదు బిల్లులను మాత్రమే ఎంచుకుని డిలీట్ చేస్తున్నారు. దీనివల్ల హోటల్ ఆదాయం తక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను భారీగా మిగిలిపోతుంది.

ఈ కుంభకోణం మూలాలు ప్రధానంగా మన హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నవంబర్ 2025లో ఐటీ అధికారులు నగరంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పిస్తా హౌస్, షా గౌస్, మెహఫిల్ వంటి బిర్యానీ దిగ్గజాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 26 కోట్ల రూపాయల నగదుతో పాటు కిలోల కొద్దీ బంగారం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దాదాపు ఒక లక్షకు పైగా రెస్టారెంట్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కు చెందిన 60 టెరాబైట్ డేటాను విశ్లేషించగా, 2019 నుంచి ఈ దందా సాగుతున్నట్లు తేలింది. కేవలం సాఫ్ట్‌వేర్ లాగ్స్ ద్వారానే 13,317 కోట్ల రూపాయల మేర బిల్లులను డిలీట్ చేసినట్లు ఆధారాలు దొరికాయి.

ఈ భారీ స్కామ్‌ను పట్టుకోవడానికి ఐటీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ టూల్స్‌ను రంగంలోకి దించింది. హోటళ్లు ఎంత మొత్తంలో బియ్యం, మాంసం కొనుగోలు చేస్తున్నాయి? అనే లెక్కలను వారు చూపించే అమ్మకాలతో పోల్చి చూశారు. టన్నుల కొద్దీ ముడి సరుకు కొని, అమ్మకాలు మాత్రం చాలా తక్కువగా చూపించడంతో అసలు గుట్టు రట్టయింది. ఇన్వాయిస్ నంబర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను గమనించిన ఏఐ టూల్స్, ఎక్కడెక్కడ బిల్లులు మాయమయ్యాయో ఇట్టే పట్టేసాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ, ఆదాయపు పన్నుకు భారీ గండి పడింది.

ప్రస్తుతం ఈ విచారణ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. రెస్టారెంట్ యజమానులతో పాటు వారికి ముడి సరుకులు సరఫరా చేసే డీలర్లపై కూడా అధికారులు కన్నేశారు. డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసే పనిలో ఉన్నారు. నిబంధనల ప్రకారం పన్ను ఎగవేతదారులకు భారీ జరిమానాతో పాటు వడ్డీని కూడా విధించనున్నారు. మీరు రెస్టారెంట్‌లో నగదు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలని అధికారులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story