Bisleri: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ పై FSSAI చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చిందంటూ వస్తున్న వార్తలపై కంపెనీ తాజాగా స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాలపై బిస్లరీ అధికారికంగా వివరణ ఇచ్చింది. ప్రస్తుతం చర్చ జరుగుతున్న నీటి నమూనా పరీక్షల వ్యవహారం దాదాపు 14 నెలల నాటి పాత విషయమని స్పష్టం చేసింది. అంతేకాకుండా, FSSAI నుంచి తమకు ఇప్పటివరకు ఈమెయిల్ ద్వారా గానీ, హార్డ్ కాపీ రూపంలో గానీ ఎలాంటి నోటీసు అందలేదని కంపెనీ పేర్కొంది. FSSAI వెబ్‌సైట్‌లో కూడా అలాంటి నోటీసు ఏదీ కనిపించలేదని, తమ నీరు తాగడానికి పూర్తిగా సురక్షితమని బిస్లరీ తేల్చి చెప్పింది.

గోవా ప్లాంట్ శాంపిల్స్ కథ ఇదే

ఈ వివాదం మూలాలను వివరిస్తూ బిస్లరీ కీలక సమాచారం పంచుకుంది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 143 ప్లాంట్లలో ఒకటైన గోవా ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్‌లో తయారైన బ్యాచ్‌కు సంబంధించిన కేసు ఇదని తెలిపింది. 2025 సెప్టెంబర్ 30న FSSAI అధికారులు గోవా ప్లాంట్ నుంచి ఆరు నీటి శాంపిల్స్ సేకరించారు. తొలి పరీక్షలో వాటిలో ఐదు శాంపిల్స్ అన్ని నాణ్యతా ప్రమాణాలకు సరిగ్గా సరిపోయాయి. అయితే ఆరో శాంపిల్‌లో మాత్రం బ్రోమేట్ స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలింది.

రీ-టెస్ట్‌లో బ్రోమేట్ ఓకే

తొలి ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2025 నవంబర్ 22న బిస్లరీ అప్పీల్ చేసింది. దీంతో FSSAI ఆ శాంపిల్‌ను తిరిగి పరీక్షించేందుకు రెఫరల్ ల్యాబ్‌కు పంపింది. ఆ రెండో పరీక్షలో బ్రోమేట్ స్థాయి నిర్దేశిత పరిమితి లోపలే ఉన్నట్లు తేలిందని బిస్లరీ తెలిపింది. అయితే అదే పరీక్షలో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నాయని వేరే అంశాన్ని లేవనెత్తారు. రెండు ల్యాబ్ ఫలితాల్లో తేడా రావడంతో, బిస్లరీ అదే శాంపిల్‌ను FSSAI గుర్తింపు పొందిన మరో స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్ష చేయించింది. అక్కడ కూడా బ్రోమేట్ పరిమితి లోపలే ఉన్నట్లు స్పష్టమైంది.

ఫిబ్రవరిలోనే రిపోర్ట్ ఇచ్చాం

స్వతంత్ర ల్యాబ్ పరీక్షా నివేదికను 2026 ఫిబ్రవరి 2న ఒక అధికారిక లేఖతో సహా FSSAI పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించినట్లు బిస్లరీ వెల్లడించింది. ఆ తర్వాత FSSAI నుంచి తమకు ఎలాంటి స్పందన గానీ, తదుపరి సమాచారం గానీ రాలేదని తెలిపింది. దాంతో ఈ అంశం అక్కడితో ముగిసిపోయిందని తాము భావించినట్లు కంపెనీ వివరించింది. అందుకే ఇప్పుడు అకస్మాత్తుగా వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది.

10 దశల్లో 90కి పైగా క్వాలిటీ చెక్స్

తాగునీటి భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని బిస్లరీ పునరుద్ఘాటించింది. తమ తయారీ ప్రక్రియలోని 10 దశల్లో 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం ఈ విషయంలో FSSAIకు పూర్తిగా సహకరిస్తూనే ఉంటామని హామీ ఇచ్చింది. ఏళ్ల తరబడి కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న బిస్లరీ వాటర్ తాగడానికి పూర్తిగా సురక్షితమని కంపెనీ తన ప్రకటనలో భరోసా ఇచ్చింది.

Next Story