Bisleri: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లేరీపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) చర్యలు తీసుకున్న నేపథ్యంలో కంపెనీ స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 143 ప్లాంట్లలో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. అన్ని ప్లాంట్లు FSSAI నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయని తెలిపింది. గోవాలోని ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్‌కు సంబంధించిన నమూనాలోనే సమస్య గుర్తించారని వివరించింది. ఈ వ్యవహారంతో తమ కంపెనీ మొత్తం ఉత్పత్తుల నాణ్యతపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని బిస్లేరీ పేర్కొంది.

ఆ ఒక్క బ్యాచ్‌పైనే అమ్మకాల నిషేధం

బిస్లేరీ వివరాల ప్రకారం.. కంపెనీ ఏడాదికి 50 వేలకుపైగా బ్యాచ్‌లను తయారు చేస్తుంది. అయితే FSSAI అమ్మకాలపై నిషేధం విధించింది మాత్రం గోవా ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్ 27న తయారైన GO 270 బ్యాచ్‌పైనే. ఈ బ్యాచ్‌కు సంబంధించిన ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవని కంపెనీ చెబుతోంది. ఈ ప్లాంట్‌ను మూసివేయాలని లేదా ఉత్పత్తి నిలిపివేయాలని FSSAI ఆదేశించలేదని తెలిపింది. ఆ బ్యాచ్ తర్వాత గోవా ప్లాంట్‌లో తయారైన నీటి నమూనాలు కూడా నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అందుకున్నాయని వెల్లడించింది.

బ్రోమేట్ పరీక్షలో ఏం తేలింది?

ఈ వివాదంలో ప్రధానంగా బ్రోమేట్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAH) అనే రసాయనాల ప్రస్తావన వచ్చింది. తొలుత పరీక్షించిన నమూనాలో బ్రోమేట్ పరిమాణం లీటరుకు 0.012 మిల్లీగ్రాములుగా నమోదైందని, నిర్దేశిత పరిమితి 0.01 మిల్లీగ్రాములని నివేదికలు వెల్లడించాయి. కంపెనీ అప్పీల్ చేయడంతో నమూనాను రిఫరల్ ల్యాబ్‌కు పంపారు. అక్కడ మళ్లీ పరీక్షించినప్పుడు బ్రోమేట్ పరిమాణం నిర్దేశిత పరిమితిలోపే ఉన్నట్లు తేలిందని బిస్లేరీ తెలిపింది. నవంబర్ 23న FSSAI ఇచ్చిన వివరణలోనూ రీటెస్టింగ్‌లో బ్రోమేట్ అనుమతించిన పరిమితిలోపే ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంతోనే మొత్తం వివాదం ముగిసిపోలేదు.

ఆరు నమూనాల్లో ఒకదానిలో PAH గుర్తింపు

బిస్లేరీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే నీటి వనరు నుంచి ఆరు నమూనాలను సేకరించి పరీక్షించారు. మొదట ఈ ఆరు నమూనాలూ నాణ్యత ప్రమాణాలను అందుకున్నాయని కంపెనీ చెబుతోంది. అయితే తర్వాత నిర్వహించిన పరీక్షల్లో GO 270 బ్యాచ్‌కు చెందిన ఆరు నమూనాల్లో ఒకదానిలో లీటరుకు 0.144 మైక్రోగ్రాముల PAH నమోదైంది. అదే బ్యాచ్‌కు చెందిన మరో నమూనాలో మాత్రం అన్ని ప్రమాణాలు సరిగానే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. పరీక్ష ఫలితాల్లో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ 2026 ఫిబ్రవరిలోనే PAH పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరినట్లు తెలిపింది. ఈ అంశంపై FSSAIతో సహకరిస్తామని, అవసరమైన న్యాయపరమైన చర్యల్లో తమ వాదనను వినిపిస్తామని బిస్లేరీ ప్రకటించింది.

వినియోగదారులకు కంపెనీ విజ్ఞప్తి

మరోవైపు FSSAI మాత్రం GO 270 బ్యాచ్‌లోని ఒక నమూనా నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ అమ్మకాల నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సమస్యకు అసలు కారణం ఏమిటో గుర్తించేందుకు రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలని కంపెనీకి సూచించింది. ఈ వ్యవహారంలో ప్రాసిక్యూషన్‌కు కూడా అనుమతి ఇచ్చినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం అంటే కంపెనీపై నేరం నిరూపితమైనట్లు కాదు. తదుపరి చట్టపరమైన ప్రక్రియలోనే విషయం తేలుతుంది. తమ ఇతర ప్లాంట్లలో పరీక్షించిన నమూనాల్లో ఆ తర్వాత PAHకు సంబంధించి ప్రతికూల ఫలితాలు రాలేదని బిస్లేరీ చెబుతోంది. ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

Next Story