Blinkit : ఆన్‌లైన్ గ్రోసరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. బ్లింకిట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకున్న పెరుగు తిన్న ఒక కస్టమర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటనపై భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చాలా సీరియస్‌గా స్పందించింది. సదరు వినియోగదారుడి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు, బ్లింకిట్ కంపెనీకి గట్టి లీగల్ నోటీసు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై 24 గంటల లోపు పూర్తి నివేదిక సమర్పించాలని డెడ్‌లైన్ విధించారు.

ఆన్‌లైన్ డెలివరీ యాప్స్ ద్వారా నిమిషాల్లో వస్తువులు ఇంటికి వస్తున్నప్పటికీ, వాటి నాణ్యతపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒక కస్టమర్ బ్లింకిట్ ద్వారా పెరుగును ఆర్డర్ చేశాడు. అది తిన్న కాసేపటికే అతని ఆరోగ్యం క్షీణించింది, అనారోగ్యం పాలయ్యాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ దారుణంపై కంపెనీ అంతర్గతంగా ఎలాంటి చర్యలు తీసుకుంది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతోందో వెంటనే స్పష్టం చేయాలని నోటీసులో డిమాండ్ చేసింది.

ఈ పెరుగు ఘటన ఒక్కటే కాదని, గత కొంతకాలంగా బ్లింకిట్ డెలివరీలపై సోషల్ మీడియా వేదికల్లో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని FSSAI పేర్కొంది. కుళ్ళిపోయినవి, అపరిశుభ్రమైన వాతావరణంలో ప్యాక్ చేసినవి, పాడైపోయిన ఆహార ఉత్పత్తులను బ్లింకిట్ డెలివరీ చేస్తోందని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. చాలా సార్లు ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోవడానికి దగ్గరగా ఉన్న వస్తువులను, నాణ్యత లేని ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్‌ను పంపుతున్నారని వినియోగదారులు నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారు. వరుసగా వస్తున్న ఈ తప్పుల వల్లే రెగ్యులేటరీ సంస్థ ఈసారి కఠినంగా వ్యవహరించింది.

వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కనీస బాధ్యత అని FSSAI తన నోటీసులో గట్టిగా గుర్తుచేసింది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా లేదా అసురక్షితమైన ఆహారాన్ని విక్రయించడం ఆహార భద్రత-ప్రమాణాల చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఈ మేరకు నోటీసులో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ లోని సెక్షన్ 26, సెక్షన్ 27లను ప్రస్తావించారు. సెక్షన్ 26 ప్రకారం కల్తీ లేదా ప్రమాదకర ఆహార పదార్థాల అమ్మకాలను నిషేధించగా, సెక్షన్ 27 ప్రకారం కస్టమర్లకు ప్రమాణాల మేరకే వస్తువులు అందేలా చూసే పూర్తి జవాబుదారీతనం సదరు ప్లాట్‌ఫామ్స్, విక్రేతలపైనే ఉంటుంది.

ఈ వ్యవహారం ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నందున FSSAI 24 గంటల టైమ్ ఇచ్చింది. బ్లింకిట్ యాజమాన్యం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో పాటు కంప్లయన్స్ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అసలు పెరుగు ఎందుకు పాడైంది? ఆ కస్టమర్ ఫిర్యాదుపై సంస్థ చేసిన విచారణలో తేలిన నిజాలేంటి? కస్టమర్ల భద్రతను రక్షించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారు? అనే వివరాలన్నింటినీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగా బ్లింకిట్ యాప్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story