Real Estate : షూటింగ్‌తో పనే లేదు..కోట్లు సంపాదిస్తున్న అమితాబ్, షారుఖ్, హృతిక్..స్టార్స్ బిజినెస్ సీక్రెట్ ఇదే
స్టార్స్ బిజినెస్ సీక్రెట్ ఇదే

Real Estate : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదా అనేది కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, డాన్సింగ్ సెన్సేషన్ హృతిక్ రోషన్ వరకు, సినీ ప్రముఖులు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో మెయిన్ ప్లేయర్లుగా మారారు. నటన ద్వారా వచ్చే పారితోషికంతో పాటు, వీరు ముంబైలోని ప్రైమ్ లొకేషన్లలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడుల ద్వారా, షూటింగ్ చేయకపోయినా వీరు ప్రతి నెలా లక్షల్లో, కోట్లలో స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బాలీవుడ్ ఎ-లిస్టర్స్ ఇప్పుడు కేవలం తమ రెమ్యూనరేషన్ల పై మాత్రమే ఆధారపడటం లేదు. వీరు శ్రీ లోటస్ డెవలపర్స్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఉదాహరణకు షారుఖ్ ఖాన్ ఈ కంపెనీలో దాదాపు రూ.10.1 కోట్లు పెట్టుబడి పెట్టగా, అమితాబ్ బచ్చన్ కూడా రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు.
ఈ జాబితాలో హృతిక్ రోషన్ పేరు ప్రముఖంగా ఉంది. హృతిక్, ఆయన తండ్రి రాకేశ్ రోషన్ సంస్థ HRX Digitak LLP ఇటీవల ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో నాలుగు కమర్షియల్ యూనిట్లను కొనుగోలు చేసింది. నవంబర్ 2025లో మహారాష్ట్ర ఐజీఆర్ రికార్డుల ప్రకారం రిజిస్టర్ అయిన ఈ డీల్ విలువ రూ.10.90 కోట్లు. అంధేరీ వెస్ట్ మీడియా, క్రియేటివ్ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఆస్తి ధరలు విపరీతంగా పెరగడం వలన భవిష్యత్తులో ఈ స్టార్స్‌కు మంచి లాభం దక్కనుంది. కేవలం వీరే కాదు అజయ్ దేవగణ్, ఏక్తా కపూర్, టైగర్ ష్రాఫ్, సారా అలీ ఖాన్, రాజ్‌కుమార్ రావ్ వంటి తారలు కూడా ఇదే మార్గంలో పెట్టుబడులు పెడుతున్నారు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి ఈ స్టార్స్ అద్దెల రూపంలో ఎంత ఆదాయం పొందుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆదాయం చాలామంది సామాన్య ఉద్యోగుల వార్షిక ప్యాకేజీ కంటే ఎక్కువే. ముంబైలోని పోష్ ఏరియా బాంద్రాలో తన అపార్ట్‌మెంట్‌ను లీజుకు ఇవ్వడం ద్వారా, జాన్ అబ్రహం ప్రతి నెలా ఏకంగా రూ.7.50 లక్షల అద్దె సంపాదిస్తున్నారు. అంతేకాకుండా 36 నెలల లీజు కోసం ఆయనకు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.24 లక్షలు లభించాయి.
90వ దశకపు ప్రముఖ నటి కరిష్మా కపూర్ కూడా బాంద్రాలోని తన 2,200 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా రూ.5.51 లక్షలు ఆర్జిస్తున్నారు. రాకేశ్ రోషన్ ఇటీవల తన భార్యతో కలిసి రూ.20 కోట్లతో 5 ఆఫీస్ స్పేస్‌లను కొనుగోలు చేశారు. ఇవి ఆయన కుటుంబానికి అదనపు ఆదాయ వనరుగా మారనున్నాయి.
అజయ్ దేవగణ్, కాజోల్ దంపతుల పెట్టుబడులు ముంబైకే పరిమితం కాలేదు. గోవాలో వారికి ఒక అత్యంత విలాసవంతమైన 5 BHK విల్లా ఉంది. ఈ విల్లాను లగ్జరీ అనుభవం కోసం ఒక రోజుకు రూ.50,000 అద్దెకు ఇస్తున్నారు. దీంతో పాటు కాజోల్ ముంబైలోని గోరెగావ్‌లో ఉన్న ఒక ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.7 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు.
ఇక అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో అత్యంత పటిష్టమైనది. జుహులో ఆయనకు జల్సా, ప్రతీక్ష, జనక్, వత్సా వంటి బంగళాలు ఉన్నాయి. కానీ ఆయన కమర్షియల్ ప్రాపర్టీలు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటివి. ఒషివారాలోని లోటస్ సిగ్నేచర్ భవనంలో ఉన్న ఆయనకు చెందిన 10,180 చదరపు అడుగుల కమర్షియల్ ప్రాపర్టీని వార్నర్ మ్యూజిక్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి లీజుకి ఇచ్చారు. దీని ద్వారా ఆయన ప్రతి నెలా లక్షల్లో స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

