BPCL: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ న్యూస్ అందించింది. ఇకపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు ఇంటికి కావలసిన రేషన్ సరుకులు, నిత్యావసరాలను నేరుగా డెలివరీ చేసేందుకు సిద్ధమవుతోంది. క్విక్ కామర్స్ సంస్థలకు పోటీగా ఈ కొత్త సేవలను ప్రారంభించబోతోంది. ఇంధన విక్రయాలపైనే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు బీపీసీఎల్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ విస్తృతమైన ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్, పెట్రోల్ పంపులను ఉపయోగించుకుని ఈ-కామర్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా సొంత పేమెంట్ గేట్‌వేను కూడా అందుబాటులోకి తెస్తోంది. హలో బీపీసీఎల్ యాప్‌ ద్వారా నేరుగా బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది.

డార్క్ స్టోర్లుగా మారనున్న ఎల్పీజీ ఏజెన్సీలు

వినియోగదారుల అవసరాలను తీర్చడానికి తమ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను డార్క్ స్టోర్లుగా మారుస్తున్నారు. ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో నిత్యావసర సరుకులు, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, ఇంట్లో వాడే నిత్యవసర వస్తువుల స్టాక్ ఉంచుతారు. పెట్రోల్ పంపుల్లోని ఇన్ అండ్ అవుట్ రీటైల్ షాపులను కూడా ఈ సేవల కోసం వాడుకోనున్నారు.

ఒక్క క్లిక్‌తో సిలిండర్‌తో పాటే సరుకులు

వినియోగదారులు బీపీసీఎల్ అధికారిక యాప్ ద్వారా తమకు కావలసిన గ్రోసరీ సామాగ్రిని బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన సరుకులను ఎల్పీజీ సిలిండర్ డెలివరీ చేసే సమయంలోనే ఇంటి ముంగిట అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. పెట్రోల్, గ్యాస్ నెట్‌వర్క్ సహకారంతో బలమైన రీటైల్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

రెండు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

ఈ వినూత్న కార్యక్రమాన్ని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీపీసీఎల్ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రయోగంలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న మార్కెట్ పోటీని తట్టుకుంటూ క్రమంగా విక్రయాల పరిమాణాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ సేవలను మిగతా రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story