Tata Group : ప్రపంచ మందగమనంలోనూ దేశీ బ్రాండ్ల జోరు.. నంబర్-1 స్థానంలో మళ్లీ టాటా గ్రూప్
నంబర్-1 స్థానంలో మళ్లీ టాటా గ్రూప్

Tata Group : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, మందగమనం నడుస్తున్నప్పటికీ, భారతీయ కార్పొరేట్ బ్రాండ్లు మార్కెట్లో అద్భుతమైన పట్టును ప్రదర్శిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా ప్రకటించిన ఇండియా 100 2026 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం భారతదేశపు దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ వరుసగా 18వ సంవత్సరం కూడా దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా తన అగ్రస్థానాన్ని ఘనంగా నిలబెట్టుకుంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాలలో టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెట్టడం దీనికి బాగా కలిసి వచ్చింది.
భారత కార్పొరేట్ రంగం సరికొత్త రికార్డు
బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని టాప్ 100 మోస్ట్ వాల్యూబుల్ బ్రాండ్ల మొత్తం బ్రాండ్ విలువ వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి ఏకంగా 252.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న తరుణంలో భారత కార్పొరెట్ రంగం ఇంతటి స్థిరమైన వృద్ధిని సాధించడం విశేషం. ఈ విజయంపై బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. విపరీతమైన దేశీయ డిమాండ్, బలమైన వ్యాపార వ్యూహాల కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ బిజినెస్ హబ్‌గా అవతరిస్తోందని కొనియాడారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఇన్నోవేషన్ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో కంపెనీలు నిరంతరం పెట్టుబడులు పెట్టడం వల్లే టాప్ 10 లోని తొమ్మిది కంపెనీల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది.
టాప్ 10 లోకి తొలిసారి అదానీ గ్రూప్ ఎంట్రీ
ఈ ఏడాది నివేదికలో అత్యంత పెద్ద హైలైట్ అదానీ గ్రూప్ సాధించిన విజయమేనని చెప్పాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, లాజిస్టిక్స్, ఎయిర్‌పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలలో అదానీ గ్రూప్ తన వ్యాపారాలను విపరీతంగా విస్తరించింది. దీనివల్ల ఈ గ్రూప్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 31 శాతం వృద్ధి చెంది 8.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అదానీ గ్రూప్ చరిత్రలోనే మొదటిసారిగా దేశంలోని టాప్-10 బ్రాండ్ల జాబితాలోకి ప్రవేశించి నేరుగా 8వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
రెండో స్థానంలో ఇన్ఫోసిస్, మూడో స్థానంలో ఎల్ఐసీ
బ్రాండ్ వాల్యూ పరంగా దేశంలోని టాప్ 10 కంపెనీల వివరాలను పరిశీలిస్తే.. టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 6 శాతం పెరిగి 33.6 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్లౌడ్, ఏఐ సేవల డిమాండ్ పుణ్యమా అని 16.4 బిలియన్ డాలర్ల వాల్యూతో వరుసగా ఐదో ఏడాది కూడా రెండో స్థానాన్ని కాపాడుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ 12 శాతం వృద్ధితో 15.3 బిలియన్ డాలర్ల విలువతో మూడో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ బ్రాండ్ వాల్యూ 2 శాతం స్వల్పంగా తగ్గి 13.9 బిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో నిలవగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం వృద్ధితో 10.8 బిలియన్ డాలర్లతో టాప్-5 లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ (9.8 బిలియన్ డాలర్లు), హెచ్‌సీఎల్ టెక్ (9 బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ (8.5 బిలియన్ డాలర్లు), ఎల్ అండ్ టీ (8.3 బిలియన్ డాలర్లు) మరియు ఎయిర్‌టెల్ (8.1 బిలియన్ డాలర్లు) నిలిచాయి.
రాకెట్ వేగంతో దూసుకెళ్లిన సుజ్లాన్ ఎనర్జీ
టాప్ 10 జాబితాకు వెలుపల, క్లీన్ ఎనర్జీ రంగంలో ఉన్న సుజ్లాన్ ఎనర్జీ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా అవతరించింది. కంపెనీ పనితీరు మెరుగుపడటం, భారీ ఆర్డర్లు రావడం వల్ల దీని బ్రాండ్ వాల్యూ ఏకంగా 114 శాతం పెరిగి 418 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా, దేశంలోనే అత్యంత బలమైన బ్రాండ్ గా ప్రసిద్ధ తాజ్ హోటల్స్ వరుసగా ఐదో సంవత్సరం కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తాజ్ హోటల్స్ 93.5/100 బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరుతో పాటు AAA+ రేటింగ్‌ను దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో జోమాటో (1.4 బిలియన్ డాలర్లు), అమూల్ (5 బిలియన్ డాలర్లు) నిలిచాయి.
ఐటీ రంగంలో దూసుకుపోతున్న టీసీఎస్
నిర్దిష్ట సేవల రంగాల పరంగా చూస్తే టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ సంస్థ 21.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో భారతదేశంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్‌గా అవతరించింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా వరుసగా ఐదో ఏడాది ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ బ్రాండ్‌గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. వీటితో పాటు ఇతర వేగంగా పెరుగుతున్న బ్రాండ్లలో అదానీ పవర్ (152% వృద్ధి - 1.8 బిలియన్ డాలర్లు), యస్ బ్యాంక్ (79% వృద్ధి), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (55% వృద్ధి), ఎంఆర్ఎఫ్ టైర్స్ (24% వృద్ధి), ఇంజనీరింగ్ సంస్థ జెట్‌వర్క్ (19% వృద్ధి) లు అద్భుతమైన ప్రదర్శనతో మార్కెట్లో సరికొత్త జోష్ నింపాయి.

