కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్వరలోనే 5Gలోకి దూకుడు

BSNL : ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన స్పీడు పెంచింది. ఇటీవల దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ఈ కంపెనీ, త్వరలోనే 5G రేస్‌లో కూడా చేరనుంది. కౌటిల్య ఎకనామిక్ ఎన్‌క్లేవ్ 2025 లో కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్ఎన్ఎల్ 4G టవర్లను త్వరలో 5G నెట్‌వర్క్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన ప్రకటించారు. అంటే, త్వరలోనే ప్రజలకు తక్కువ ధరలో, హై స్పీడ్ 5G సేవలు బీఎస్ఎన్ఎల్ ద్వారా దేశవ్యాప్తంగా లభించనున్నాయి.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ 4G టవర్లను 5G నెట్‌వర్క్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. భారత్ ఇప్పుడు 4G టెక్నాలజీ గ్లోబల్ క్లబ్‌లో చేరిందని ఆయన తెలిపారు. ఇంతకుముందు ఈ క్లబ్‌లో ZTE, Huawei, Nokia, Samsung, Ericsson వంటి అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ఉండేవి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 92,564 టవర్లను ప్రారంభించారు. దీని ఫలితంగా బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ ఇప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, భరూచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశాన్ని కలుపుతోంది. భారతదేశం సొంతంగా 4G స్టాండర్డ్‌ను తయారు చేసుకుందని, దీనితో ఆగేది లేదని, రాబోయే 6-8 నెలల్లో టవర్లను 5G కి అప్‌గ్రేడ్ చేస్తామని, తద్వారా భారత్‌లో ప్రజలకు ఎండ్ టు ఎండ్ 5G నెట్‌వర్క్ ప్రయోజనం లభిస్తుందని సింధియా తెలిపారు.

భారతదేశంలో స్థానిక స్టార్టప్‌లు, టెక్నాలజీ దిగ్గజాలు రెండూ చురుకుగా ఉండటంతో ఇన్నోవేషన్ వేగంగా జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ విషయంలో కూడా భారత్ ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అక్టోబర్ 8 నుంచి 11 వరకు జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో ఈ కొత్త పురోగతిని ప్రపంచానికి చూపిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో 150 దేశాల నుంచి దాదాపు 1500 ప్రదర్శకులు, 7000 మందికి పైగా డెలిగేట్లు పాల్గొంటారు. ఈ సందర్భంగా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, టెక్నాలజీలో వచ్చిన కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story