జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ తప్పదా?

BSNL 5G : ప్రస్తుతం దేశంలో టెలికాం రంగం, ముఖ్యంగా 5జీ సేవల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, ఈ రెండు దిగ్గజాలకు ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. దీనికి కారణం దేశంలోని రెండు ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలలో టెలికాం పరిశ్రమలోని మరొక దిగ్గజం 5జీ సేవలతో రంగంలోకి దిగనుంది. ఆ దిగ్గజం మరెవరో కాదు, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌కు కచ్చితంగా నష్టం తప్పదు. ముఖ్యంగా, బీఎస్ఎన్ఎల్ 5జీ ప్లాన్‌లు చౌకగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ ధర ప్లాన్‌ల కోసం చూసే వినియోగదారులు ఇతర కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారే అవకాశం ఉంది.

బీఎస్ఎన్ఎల్ త్వరలో తన 5జీ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. టెక్నికల్ టెస్టింగ్, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియలను పూర్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ టెలికాం దిగ్గజం 5జీ కోసం ఏర్పాటు చేసిన డివైజ్‌లు, ఇన్‌స్టాలేషన్, టెక్నికల్ టెస్టింగ్ లన్నీ విజయవంతమయ్యాయని అధికారులు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం.. 5జీ సేవలను ఢిల్లీ , ముంబై మెట్రో నగరాలలో డిసెంబర్ నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దిశగా బీఎస్ఎన్ఎల్ పనులు మొదలుపెట్టింది.

ఇటీవల 4జీ సేవలను ప్రారంభించినప్పుడు, బీఎస్ఎన్ఎల్ దాదాపు 95 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే, తాము ఏర్పాటు చేస్తున్న టవర్ల ద్వారా వినియోగదారులకు 5జీ నెట్‌వర్క్ కూడా అందుబాటులోకి వస్తుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఢిల్లీ, ముంబైలో ప్రారంభించిన తర్వాత, దేశంలోని చిన్న, పెద్ద పట్టణాలలో 5జీ సేవలను విస్తరించనున్నారు.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. 5జీ రాక వార్త ఈ వినియోగదారులకు పెద్ద ఊరట. ప్రస్తుతం 5జీ సేవలు ఢిల్లీ, ముంబైలో ప్రారంభమైనప్పటికీ, రాబోయే రోజుల్లో తమ ప్రాంతాలకు కూడా 5జీ నెట్‌వర్క్ వస్తుందనే భరోసా కోట్లాది మంది వినియోగదారులలో పెరుగుతుంది. ఈ 9 కోట్లకు పైగా వినియోగదారులకు, జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు అందుబాటులో ఉన్నట్లుగానే, హై స్పీడ్ డేటా సౌకర్యం లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌లోకి అడుగుపెట్టడం ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీని ఇవ్వనుంది.

బీఎస్ఎన్ఎల్ 5జీ ప్లాన్‌లు ఇతర ప్రైవేట్ కంపెనీల కంటే చాలా చౌకగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఢిల్లీ, ముంబైలలో తక్కువ ధర ప్లాన్‌ల కోసం చూసే వినియోగదారులు పెద్ద సంఖ్యలో బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపవచ్చు. దీని ప్రభావంతో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులను కోల్పోవాల్సి రావచ్చు. ఢిల్లీ, ముంబైలు కేవలం టెస్టింగ్ కోసం మాత్రమేనని, దేశమంతటా 5జీ ప్రారంభమయ్యాక బీఎస్ఎన్ఎల్‌కు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ కేవలం 5జీతో ఆగడం లేదు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న 6జీ నెట్‌వర్క్ కోసం కూడా బీఎస్ఎన్ఎల్ ఒక మెయిన్ ప్లేయర్ గా నిలబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 95 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేశారు, ఇవి 4జీతో పాటు 5జీ సేవలను కూడా అందిస్తాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ టవర్ల సంఖ్య 1.25 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story