BSNL : కస్టమర్ ఐడీ చెక్ చేయకుండానే సిమ్ ఇచ్చేస్తారా? బీఎస్ఎన్‌ఎల్‌కు కర్నాటక హైకోర్టు భారీ జరిమానా
బీఎస్ఎన్‌ఎల్‌కు కర్నాటక హైకోర్టు భారీ జరిమానా

BSNL : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్‌కు కర్నాటక హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఒక డూప్లికేట్ సిమ్ కార్డ్ జారీ చేయడంలో కంపెనీ చేసిన నిర్లక్ష్యం కారణంగా సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.87 లక్షలకు పైగా బ్యాంక్ అకౌంట్ నుంచి కాజేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. బాధిత కోఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.55 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని బీఎస్ఎన్‌ఎల్ సంస్థను ఆదేశించింది. సరైన గుర్తింపు కార్డులు, వివరాలు వెరిఫై చేయకుండానే అపరిచిత వ్యక్తులకు డూప్లికేట్ సిమ్ ఇవ్వడం వల్లే నేరగాళ్లకు బ్యాంకింగ్ ఓటీపీలు యాక్సెస్ దొరికిందని కోర్టు స్పష్టం చేసింది.
అసలు రూ.87 లక్షల ఫ్రాడ్ ఎలా జరిగిందంటే
ఈ సంచలన కేసు వివరాల్లోకి వెళ్తే.. శ్రీ బసవేశ్వర పట్టణ సహకార బ్యాంక్ నియమిత అనే ఒక కోఆపరేటివ్ బ్యాంక్‌కు కెనరా బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్‌కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓటీపీల కోసం ఒక బీఎస్ఎన్‌ఎల్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేది. అయితే 2019 ఫిబ్రవరి 6, 7 తేదీల మధ్య కాలంలో ఈ అకౌంట్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఆర్‌టీజీఎస్ (RTGS), నెఫ్ట్ (NEFT) ల ద్వారా ఏడు విడతలుగా ఏకంగా రూ.87.7 లక్షలు మాయమయ్యాయి. బ్యాంక్ అధికారులు అలర్ట్ అయి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.
బెంగళూరు ఆఫీస్ నుంచి సిమ్ స్వాపింగ్ మాయాజాలం
సైబర్ పోలీసులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బెంగళూరులోని బీఎస్ఎన్‌ఎల్ ఆఫీసుకు వెళ్లి.. అసలు బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఎలాంటి అప్లికేషన్ ఇవ్వకపోయినా, ఆ నంబర్‌కు సంబంధించిన డూప్లికేట్ సిమ్ కార్డును సంపాదించారు. సిమ్ కార్డు యాక్టివేట్ కాగానే బ్యాంక్ వాళ్ల ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది. ఇక దొంగల దగ్గర ఉన్న కొత్త సిమ్ కార్డుకు కెనరా బ్యాంక్ ఓటీపీలు రావడం మొదలైంది. దీనిని ఆసరాగా చేసుకుని వాళ్లు మొత్తం డబ్బును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఆ తర్వాత పోలీసుల యాక్షన్ వల్ల దొంగల నుంచి రూ.37 లక్షలకు పైగా రికవరీ చేసినప్పటికీ బ్యాంక్‌కు ఇంకా రూ.50.50 లక్షల నికర నష్టం మిగిలిపోయింది.
కంపెనీ తప్పును ఉద్యోగిపై నెట్టలేం
ఈ కేసును విచారించిన జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ టెలికాం కంపెనీల బాధ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మొబైల్ నంబర్ బ్యాంకింగ్ లావాదేవీలకు లింక్ అయి ఉన్నప్పుడు, డూప్లికేట్ సిమ్ ఇచ్చే విషయంలో కంపెనీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అసలు కస్టమర్ కాని వ్యక్తికి సిమ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్‌ఎల్ ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి నిర్లక్ష్యం వహించినట్లు అంతర్గత విచారణలో తేలింది. అతనిపై డిపార్ట్‌మెంటల్ యాక్షన్ తీసుకున్నామని కంపెనీ చెప్పగా.. ఉద్యోగి తప్పు చేసినా సరే, యాజమాన్యంగా బీఎస్ఎన్‌ఎల్ సంస్థే పూర్తి బాధ్యత వహించాలని కోర్టు తేల్చి చెప్పింది.
బీఎస్ఎన్‌ఎల్ చిత్ర విచిత్ర వాదనలు
కోర్టులో బీఎస్ఎన్‌ఎల్ లాయర్లు ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. సదరు కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఇన్సూరెన్స్ పాలసీ ఉందని, దాని ద్వారా వారికి కొంత డబ్బు వెనక్కి వచ్చేసింది కాబట్టి తాము మళ్లీ అదనంగా పరిహారం కట్టాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఈ వాదనను జడ్జి గారు పూర్తిగా తప్పుబట్టారు. ఒక సంస్థ తన భద్రత కోసం ఇన్సూరెన్స్ చేయించుకుంటే.. అది టెలికాం కంపెనీ చేసిన తప్పును లేదా నిర్లక్ష్యాన్ని కడిగేయలేదని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని తప్పు చేసిన వారిని వదిలేయలేమని రూలింగ్ ఇచ్చారు.
బీఎస్ఎన్‌ఎల్ కట్టాల్సిన ఫైన్ లెక్కలు ఇవే
గతంలో కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఈ జరిమానా మొత్తాన్ని మరింత పెంచింది. దీని ప్రకారం బ్యాంక్‌కు జరిగిన అసలు నష్టం రూ.50,50,762 లతో పాటు, మానసిక క్షోభ, నిర్లక్ష్యానికి గానూ మరో రూ.5 లక్షల అదనపు హరిజానాను బీఎస్ఎన్‌ఎల్ చెల్లించాలి. అంతేకాకుండా ఫ్రాడ్ జరిగిన రోజు అంటే 2019 ఫిబ్రవరి 7 నుండి ఇప్పటివరకు ఏటా 9 శాతం వడ్డీతో కలిపి ఈ మొత్తాన్ని బ్యాంక్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. అలాగే బీఎస్ఎన్‌ఎల్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ జడ్జిమెంట్ రాబోయే రోజుల్లో మిగతా టెలికాం కంపెనీలకు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని లీగల్ నిపుణులు అంటున్నారు.

