BSNL: 2 లక్షల కొత్త 4G టవర్లు, 5G విస్తరణ.. రూ. 77,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్
రూ. 77,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన నెట్‌వర్క్‌ను పూర్తిగా ఆధునీకరించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 2,00,000 అదనపు 4G సైట్లను ఏర్పాటు చేయడం, 5G నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టడం, కస్టమర్ సేవలను మెరుగుపరచడం కోసం ఏకంగా రూ. 77,000 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ వివరాలను సమాచార సాంకేతిక పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా ఆర్థిక సంవత్సరం 2029 నాటికి కంపెనీ ఆపరేషనల్ బ్రేక్-ఈవెన్ (ఆదాయం, ఖర్చులు సమానమయ్యే స్థితి) సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా 98 శాతం నెట్‌వర్క్ కవరేజ్‌ను అందుకోగలదని అంచనా వేస్తున్నారు.
ఆర్థిక లోటు, నష్టాల విశ్లేషణ
పార్లమెంటరీ ప్యానెల్ బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 2026 మధ్య ఆపరేషన్ల ద్వారా వచ్చే రాబడి కొంత పెరిగినప్పటికీ, కంపెనీ మొత్తం నికర నష్టం FY25లో రూ. 2,247 కోట్లు ఉండగా, FY26 నాటికి అది రూ. 4,738 కోట్లకు (రెట్టింపు కంటే ఎక్కువ) పెరిగింది. అయితే ఈ నష్టాలు పెరగడానికి ప్రధాన కారణం డిప్రిసియేషన్, అమొర్టైజేషన్ ఖర్చులు పెరగడమేనని DoT స్పష్టం చేసింది. FY25లోనే బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్, నెట్‌వర్క్ విస్తరణ కోసం రూ. 26,022 కోట్ల రికార్డు స్థాయి క్యాపెక్స్ ఖర్చు చేసిందని, ఇది భవిష్యత్తులో స్థిరమైన రాబడికి బలమైన పునాదిగా మారుతుందని వివరించింది.
బిఎస్ఎన్ఎల్ - వోడాఫోన్ ఐడియా మౌలిక వసతుల భాగస్వామ్యం
రెండు టెలికాం కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్‌లను పంచుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వం 49 శాతం వాటా కలిగి ఉన్న వోడాఫోన్ ఐడియాతో బిఎస్ఎన్ఎల్ సినర్జీని విస్తరిస్తోంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 1,441 టవర్లను వోడాఫోన్ ఐడియాకు లీజుకు ఇవ్వగా, మరిన్ని టవర్లను పంచుకోవడంపై చర్చలు వేగవంతమయ్యాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఇప్పటికే ఇరు కంపెనీల మధ్య ఇంట్రా-సర్కిల్ రోమింగ్ ఒప్పందాలు అమలులో ఉన్నాయి. పార్లమెంటరీ కమిటీ కూడా రాబోయే 6 నెలల్లో టవర్, ఫైబర్, స్పెక్ట్రమ్ షేరింగ్‌పై స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించింది.
బిఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని పెంచుకోవడానికి కేవలం ప్లాన్లపైనే కాకుండా రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లపై దృష్టి సారిస్తోంది. కంపెనీ తన వద్ద ఉన్న భవనాలను డేటా సెంటర్లుగా, ఎడ్జ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌గా మార్చడం ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యూజ్ కేసులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంటర్‌ప్రైజ్ డిజిటల్ సొల్యూషన్స్‌తో కార్పొరేట్ రంగానికి సేవలందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కోసం రూ. 3.22 లక్షల కోట్ల విలువైన పునరుద్ధరణ ప్యాకేజీలను ఆమోదించిన సంగతి తెలిసిందే.

