BSNL AI Plan 2026 : బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే స్కెచ్.. ఏఐ టెక్నాలజీతో ప్రైవేట్ కంపెనీలకు షాక్
ఏఐ టెక్నాలజీతో ప్రైవేట్ కంపెనీలకు షాక్

BSNL AI Plan 2026 : ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి సిద్ధమైంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల పోటీని తట్టుకుంటూ, కస్టమర్లు నెట్‌వర్క్ వదిలి వెళ్లకుండా ఉండేందుకు బిఎస్ఎన్ఎల్ ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈసారి బిఎస్ఎన్ఎల్ నమ్ముకున్నది మరేదో కాదు.. ఆధునిక టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ సాయంతో కంపెనీ దశ దిశ మార్చబోతున్నట్లు బిఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె రవి ప్రకటించారు.
ఏఐతో బిఎస్ఎన్ఎల్ చేయబోయే ఆ 3 పనులు ఇవే
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొన్న బిఎస్ఎన్ఎల్ సీఎండీ, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ముఖ్యంగా మూడు రంగాలపై ఏఐ ప్రభావం ఉండబోతోంది:
నెట్‌వర్క్ మేనేజ్మెంట్: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ సిగ్నల్ సమస్యలు ఉన్నాయి? ఎక్కడ నెట్‌వర్క్ లోపాలు వస్తున్నాయి? అనే విషయాలను ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. దీనివల్ల సమస్య వచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించడం సులభమవుతుంది.
కస్టమర్ సంతృప్తి : బిఎస్ఎన్ఎల్ వాడే వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించడానికి ఏఐని వాడుతున్నారు. కస్టమర్ల సమస్యలను వేగంగా పరిష్కరించడం, వారికి తగిన ప్లాన్లను సూచించడం వంటివి దీని ద్వారా జరుగుతాయి.
పోర్టింగ్ సమస్యకు చెక్: కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వదిలి ఇతర నెట్‌వర్క్‌లకు ఎందుకు మారుతున్నారు? అనే ట్రెండ్స్‌ను ఏఐ విశ్లేషిస్తుంది. యూజర్లు వెళ్లకుండా వారిని ఆకట్టుకోవడానికి అవసరమైన మార్పులను కంపెనీ తక్షణమే చేపడుతుంది.
సొంతంగా స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్
బిఎస్ఎన్ఎల్ కేవలం ఏఐని వాడటమే కాదు, సొంతంగా SLM టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్‌లో భాగంగా పనిచేస్తుంది. ఎక్కడైనా నెట్‌వర్క్ మొరాయిస్తే ఈ మోడల్ ఆటోమేటిక్‌గా దాన్ని గుర్తించి రిపోర్ట్ చేస్తుంది. ఈ సాంకేతికత వల్ల కంపెనీ ఆదాయం సుమారు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, తక్కువ ధరకే 4G, 5G సేవలను అందిస్తూ దేశవ్యాప్తంగా కస్టమర్లను పెంచుకోవడమే లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది.

