నిర్మలమ్మ వరాల జల్లు కురిపిస్తారా?

Budget 2026: ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026-27పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక రంగాలైన ఆరోగ్యం, విద్య రంగాల్లో ఈసారి విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. సామాన్యుడికి వైద్యం భారమవ్వకూడదని, విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్య అందాలని కోరుకుంటూ ఈ రెండు రంగాలు నిర్మలమ్మ వైపు ఆశగా చూస్తున్నాయి.

ఆరోగ్య రంగానికి సంబంధించి గత ఏడాది అంటే 2025-26లో ప్రభుత్వం రూ.99,858.56 కోట్లు కేటాయించింది. ఈసారి ఆ సంఖ్య లక్ష కోట్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం నిధులు కేటాయించడమే కాకుండా, ప్రజల జేబుల నుంచి అయ్యే ఖర్చును తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం, డిజిటల్ హెల్త్ మిషన్‌ను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు విద్యా రంగం కూడా ఈ బడ్జెట్ నుంచి భారీ సాయాన్ని ఆశిస్తోంది. గత ఏడాది విద్య కోసం రూ.1,28,650 కోట్లు కేటాయించగా, అందులో స్కూల్ ఎడ్యుకేషన్‌కే సింహభాగం దక్కింది. అయితే, ఇప్పుడు కేవలం బడులు కట్టడం మాత్రమే సరిపోదని, విద్యార్థులకు ప్రస్తుత కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అందించాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికతలను పాఠ్యాంశాల్లో చేర్చడం కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యం ప్రకారం.. 2025 నాటికి కనీసం 50 శాతం మంది విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యాలను అందించాల్సి ఉంది.

ఉన్నత విద్య రంగంలో కాలేజీల సంఖ్య పెరిగినప్పటికీ, నాణ్యమైన పరిశోధనలు, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వచ్చేలా పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులను మార్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం కాలేజీల్లో ప్రవేశాల రేటు పెరిగిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు క్వాలిటీ పై ఫోకస్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యా రంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి కోసం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా భారత్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చవచ్చు.

బడ్జెట్ 2026 అనేది కేవలం లెక్కల పద్దు మాత్రమే కాదు, ఒక ఆరోగ్యవంతమైన మరియు విజ్ఞానవంతమైన నవభారత నిర్మాణానికి పునాది కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యతనిస్తూ తీసుకోబోయే నిర్ణయాలు దేశ పురోగతికి దిక్సూచిగా మారనున్నాయి. ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం, విద్యా రంగంలో ఏఐ మాయాజాలం ఈ బడ్జెట్‌లో హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story