Budget 2026 : నిర్మలమ్మ మార్క్ బడ్జెట్.. స్లాబ్ లు మార్చలేదు కానీ, లోపల మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు
స్లాబ్ లు మార్చలేదు కానీ, లోపల మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు

Budget 2026 : బడ్జెట్ 2026లో మధ్యతరగతి, జీతగాళ్ల కోసం ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు లేకపోయినప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా సామాన్యుల జేబుపై ప్రభావం చూపే పలు కీలక మార్పులను ప్రకటించారు. పన్ను నిబంధనలను సులభతరం చేయడం నుంచి విదేశీ ప్రయాణాలు, షేర్ మార్కెట్ లాభాల వరకు మొత్తం 11 అంశాల్లో సమూల మార్పులు వచ్చాయి. అవేంటో సామాన్యుడికి అర్థమయ్యేలా సులభమైన భాషలో తెలుసుకుందాం.
బడ్జెట్ 2026: సామాన్యుడిపై ప్రభావం చూపే 11 కీలక అంశాలు
1. కొత్త ఆదాయపు పన్ను చట్టం: వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. దీని వల్ల పన్ను నిబంధనలు, ఐటీ ఫామ్స్ చాలా సులభంగా మారతాయి. సామాన్యులు ఎవరి సాయం లేకుండానే స్వయంగా పన్నులు కట్టుకునేలా ఫామ్స్‌ను రూపొందించనున్నారు.
2. తక్కువ పన్ను సర్టిఫికేట్: చిన్న పన్ను చెల్లింపుదారులు ఇకపై తక్కువ లేదా సున్నా పన్ను కోత సర్టిఫికేట్ కోసం అధికారుల చుట్టూ తిరగక్కర్లేదు. ఆటోమేటిక్ గానే ఈ సర్టిఫికెట్ వచ్చేలా కొత్త వ్యవస్థను తెస్తున్నారు.
3. రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట: మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ద్వారా వచ్చే వడ్డీపై ఇకపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. అలాగే దీనిపై టీడీఎస్ కూడా కట్ చేయరు. బాధితులకు ఇది పెద్ద ఊరట.
4. విదేశీ టూర్లు, విద్య చౌక: విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ ను 5%, 20% నుంచి ఏకంగా 2 శాతానికి తగ్గించారు. అలాగే విదేశీ విద్య, వైద్యం కోసం పంపే డబ్బుపై కూడా ట్యాక్స్ 5% నుంచి 2 శాతానికి తగ్గింది.
5. ఐటీఆర్ గడువులో మార్పులు: ఒకవేళ మీరు ట్యాక్స్ రిటర్న్స్ లో ఏదైనా తప్పు చేస్తే, దానిని సవరించుకోవడానికి గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పెంచారు. అయితే దీనికి స్వల్పంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ ఐటీఆర్ ఫైలింగ్ గడువు మాత్రం జూలై 31గానే ఉంటుంది.
6. ఎన్ఆర్ఐల ఆస్తి విక్రయాలు: ఎన్ఆర్ఐలు భారత్ లో ఆస్తులు అమ్మినప్పుడు టీడీఎస్ కట్ చేయడం ఇకపై చాలా సులభం కానుంది. ట్యాన్ నంబర్ అవసరం లేకుండా కేవలం కొనుగోలుదారుని పాన్ కార్డు ద్వారా పన్ను చెల్లించవచ్చు.
7. విదేశీ ఆస్తుల వెల్లడికి వెసులుబాటు: విదేశాల్లో ఆస్తులు లేదా ఆదాయం ఉండి, పొరపాటున వెల్లడించని వారి కోసం 6 నెలల ప్రత్యేక పథకాన్ని తెచ్చారు. రూ. కోటి లోపు ఆస్తి ఉన్నవారు 60% పన్ను చెల్లించి జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఆస్తి వెల్లడించి పన్ను కట్టిన వారు కేవలం రూ. లక్ష ఫీజు కడితే సరిపోతుంది.
8. పెనాల్టీలు, శిక్షల సరళీకరణ: చిన్న చిన్న పొరపాట్లకు క్రిమినల్ కేసులు పెట్టకుండా కేవలం జరిమానాలతో సరిపెట్టేలా నిబంధనలను మార్చారు. ఆడిట్ రిపోర్టులు ఇవ్వకపోయినా, అకౌంట్ బుక్స్ చూపకపోయినా ఇకపై అది పెద్ద నేరం కాదు.
9. షేర్ బైబ్యాక్ - కొత్త పన్ను: కంపెనీలు షేర్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చే లాభాలను ఇకపై క్యాపిటల్ గెయిన్ గా పరిగణిస్తారు. ఇది సాధారణ ఇన్వెస్టర్లకు లాభదాయకం. అయితే పన్ను ఎగ్గొట్టకుండా ఉండేందుకు ప్రమోటర్లపై అదనపు పన్ను విధించారు.
10. దిగుమతి వస్తువుల ధరలు తగ్గుతాయి: వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 20% నుంచి 10 శాతానికి తగ్గించారు. అంటే విదేశీ వస్తువుల ధరలు తగ్గుతాయి.
11. ఎఫ్ అండ్ ఓ (F&O) ట్రేడింగ్ ప్రియం: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT)ని భారీగా పెంచారు. ఆప్షన్స్ ప్రీమియంపై పన్నును 0.15%కి పెంచడం వల్ల ట్రేడర్ల జేబుకు చిల్లు పడటం ఖాయం.

