ధరలు దిగొచ్చేలా జీఎస్టీ 2.0 ప్లాన్

Budget 2026 : భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన బలం దేశంలోని కోట్లాది మంది సామాన్యులే. మనం చేసే ఖర్చే దేశ జీడీపీలో దాదాపు 60 శాతం వాటాను కలిగి ఉంది. అందుకే, రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 పై సామాన్యుడి ఆశలు భారీగా ఉన్నాయి. పెరుగుతున్న ధరల నుంచి ఊరటనిస్తూ, సామాన్యుడి జేబులో నాలుగు పైసలు మిగిలేలా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? పన్నుల సంస్కరణలు ఎలా ఉండబోతున్నాయి? అనే ఆసక్తికర అంశాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం వినియోగదారుల ప్రధాన ఆశ జీఎస్టీ 2.0 పైనే ఉంది. పన్ను స్లాబులను సరళీకరించి, కేవలం రెండు ప్రధాన రేట్లను మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సామాన్యుడికి తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తే, మార్కెట్‌లో కొనుగోళ్లు పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరిగెత్తుతుంది. ఇది నేరుగా మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ ఏమిటంటే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం. ప్రస్తుతం వీటిపై రాష్ట్రాలు, కేంద్రం విడివిడిగా పన్నులు వేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని జీఎస్టీ కిందికి తెస్తే రవాణా చౌకగా మారుతుంది, తద్వారా నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాలను జీఎస్టీలో చేర్చడం వల్ల ఇల్లు కట్టుకోవడం కూడా సామాన్యుడికి భారంగా ఉండదు. దాగి ఉన్న పన్నుల భారం తగ్గడం వల్ల స్థిరాస్తి రంగం కొత్త కళను సంతరించుకుంటుంది.

భారత్‌ను గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉండవచ్చు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం వల్ల స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ నియమాలను సరళీకరించడం ద్వారా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది, ఆ ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి చేరుతుంది. వ్యాపారం చేయడం సులభతరం అయితే, పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మొత్తంగా చూస్తే, బడ్జెట్ 2026 అనేది వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ఉండబోతోంది. సరళమైన పన్ను విధానం, తక్కువ ఉత్పత్తి వ్యయం, సులభతరమైన వ్యాపార వాతావరణం కలిస్తేనే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యం. సామాన్యుడు భయం లేకుండా ఖర్చు చేయగలిగినప్పుడే దేశాభివృద్ధి కథ వేగంగా ముందుకు సాగుతుంది. ఈ దిశగా నిర్మలమ్మ ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story