సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా నిర్మలమ్మ లెక్కలు

Budget 2026 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ అంకెల పరంగానే కాకుండా, దేశ ఆర్థిక క్రమశిక్షణను చాటిచెప్పే దిశగా సాగింది. ప్రభుత్వం తన ఆదాయ వ్యయాల మధ్య బ్యాలెన్సింగ్ కాపాడుతూనే, భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ బడ్జెట్‌లో అసలు దేశంపై ఉన్న అప్పు ఎంత? మన రూపాయి ఎటు వెళ్తోంది? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పరిమాణం అక్షరాలా రూ.53.5 లక్షల కోట్లు. గత ఏడాది ఇది రూ.50.65 లక్షల కోట్లుగా ఉండేది. అంటే ప్రభుత్వం తన ఖర్చును పెంచుతూనే, అభివృద్ధి వేగాన్ని తగ్గకుండా చూసుకుంటోంది. దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించే ఫిషియల్ డెఫిసిట్ విషయంలో ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ కొట్టింది. 2021-22లో ఇచ్చిన హామీ మేరకు ఈ లోటును క్రమంగా తగ్గిస్తూ, 2026-27 సంవత్సరానికి దీన్ని 4.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇన్వెస్టర్లలో భారత్ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతుంది.

దేశంపై ఉన్న అప్పుల భారం విషయంలోనూ శుభవార్త అందింది. డెట్-టు-జీడిపి రేషియో గత ఏడాది 56.1 శాతంగా ఉండగా, ఇప్పుడు దాన్ని 55.6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంటే దేశ మొత్తం సంపాదనతో పోలిస్తే అప్పుల శాతం తగ్గుముఖం పడుతోంది. అయితే, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మార్కెట్ నుంచి రూ.11.7 లక్షల కోట్ల అప్పు తీసుకోనుంది. ఈ అప్పును కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే వాడటం వల్ల భవిష్యత్తులో దేశానికి అది ఆదాయంగా మారుతుందని అర్థశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ బడ్జెట్‌లో విదేశీ వాణిజ్యం, ముఖ్యంగా చైనా గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కంటైనర్ మార్కెట్లో చైనాకు 95 శాతం వాటా ఉంది. దీన్ని సవాలు చేస్తూ భారత్‌లోనే కంటైనర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల దేశంలో భారీగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, విదేశీ ఎగుమతులకు మనపై మనకు భరోసా కలుగుతుంది. మరోవైపు, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ పన్నుల ఆదాయంలో 41 శాతం వాటాను రాష్ట్రాలకే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా సుమారు రూ. 1.4 లక్షల కోట్లు రాష్ట్రాల ఖజానాకు చేరనున్నాయి. మొత్తానికి ఇది దేశీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తూనే, ఆర్థిక క్రమశిక్షణను పాటించే బాలెన్స్‌డ్ బడ్జెట్‌గా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story