నిర్మలమ్మ అమ్ములపొదిలో ఈసారి ఏముంది?

Budget 2026 : బడ్జెట్ 2026 ముంగిట దేశవ్యాప్తంగా సామాన్యుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు ఊహించని రీతిలో పన్ను ఊరటనిచ్చారు. దీంతో ఈ ఏడాది కూడా అలాంటి మ్యాజిక్ ఏదైనా జరుగుతుందా అని ట్యాక్స్ పేయర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జీతగాళ్ల కొనుగోలు శక్తిని పెంచేందుకు ప్రభుత్వం గత బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి కళ్లు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌పైనే ఉన్నాయి.

గత బడ్జెట్ 2025లో ప్రభుత్వం ఆదాయపు పన్ను విషయంలో పెను మార్పులు చేసింది. కొత్త పన్ను విధానంలో ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఒక్క రూపాయి కూడా పన్ను లేకుండా చేసింది. దీనికి అదనంగా జీతగాళ్లకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000 కూడా కలపడంతో, దాదాపు రూ.12.75 లక్షల ఆదాయం ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయింది. ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు ఒక పెద్ద వరంగా మారింది.

ప్రభుత్వం 2025లో పన్ను స్లాబులను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా మార్చింది. రూ.4 లక్షల వరకు సున్నా పన్ను, రూ.4-8 లక్షల వరకు 5%, రూ.8-12 లక్షల వరకు 10% ఇలా 30% వరకు వివిధ స్లాబులను కేటాయించింది. దీనివల్ల ఎక్కువ ఆదాయం ఉన్నవారు కూడా తక్కువ పన్ను కట్టే అవకాశం కలిగింది. అలాగే పాత పన్ను చట్టాలను తొలగించి, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్ 2025ను తెచ్చింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సామాన్యుడికి అర్థమయ్యే భాషలోకి మార్చడం.

గతేడాది టీడీఎస్ నిబంధనల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అద్దె ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.లక్షకు పెంచడం విశేషం. అంతేకాకుండా, ఐటీఆర్ అప్‌డేట్ చేసుకునే సమయాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించారు. ఇవన్నీ సామాన్య ప్రజలకు పన్ను సంబంధిత ఇబ్బందులను తగ్గించాయి.

బడ్జెట్ 2026 నుంచి ఏమేం ఆశించవచ్చు?

మరి కొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్ 2026పై నిపుణులు మిశ్రమ అంచనాలు వేస్తున్నారు. ధరల పెరుగుదల, జీవన వ్యయం భారంగా మారిన నేపథ్యంలో పన్ను స్లాబుల్లో స్వల్ప మార్పులు రావొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే గతేడాది ఇప్పటికే భారీ ఊరట నిచ్చినందున, ఈసారి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని మరికొందరు అంటున్నారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడం, పెట్టుబడులకు ప్రోత్సాహకాలు అందించడంపై ప్రభుత్వం ఈసారి ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story