పాత పద్ధతిలో ట్యాక్స్ కట్టడం ఇక కుదరదా?

Budget 2026 : బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానానికి భారీ ఊరటనిచ్చిన తర్వాత, ఇప్పుడు అందరి చూపు బడ్జెట్ 2026పై పడింది. గతేడాది ప్రభుత్వం సెక్షన్ 87A కింద రాయితీలను పెంచడం ద్వారా రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను లేకుండా చేసింది. శాలరీ పొందే వారికి స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని ఈ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది. అయితే ఈ మార్పుల వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం పాత పన్ను విధానాన్ని క్రమంగా పక్కన పెట్టడమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కొత్త పన్ను విధానం ఎందుకు పాపులర్ అవుతోంది?

ఆర్థిక నిపుణుడు సురేష్ సురానా అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడులు, బీమా ప్రీమియంలు వంటి పన్ను మినహాయింపులు లేని వారికి కొత్త విధానం వరప్రదంగా మారింది. తక్కువ ట్యాక్స్ స్లాబ్స్ ఉండటం, లెక్కలు సులభంగా ఉండటంతో యువ ఉద్యోగులు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రతి బడ్జెట్‌లో సెక్షన్ 115BAC ను బలోపేతం చేస్తూ, ఈ విధానాన్ని డిఫాల్ట్ పద్ధతిగా మార్చేసింది. పన్నుల లెక్కింపులో సంక్లిష్టతను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

పాత పన్ను విధానం ఇప్పుడే ఎందుకు పోదు?

పాత పన్ను విధానాన్ని అకస్మాత్తుగా రద్దు చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాదు. ఎందుకంటే హోమ్ లోన్ తీసుకున్న వారు, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టే వారు, పీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన వారికి పాత విధానమే ఇప్పటికీ లాభదాయకంగా ఉంది. చాలా మంది ట్యాక్స్ పేయర్లు ఈ మినహాయింపులను దృష్టిలో పెట్టుకుని తమ 15-20 ఏళ్ల ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వారిని ఇబ్బంది పెట్టకుండా ఒక్కసారిగా పాత విధానాన్ని ఎత్తేయడం కష్టమని ఎస్‌వీఏఎస్ బిజినెస్ అడ్వైజర్స్ డైరెక్టర్ శుభం జైన్ పేర్కొన్నారు.

బడ్జెట్ 2026లో ఏం జరగవచ్చు?

బడ్జెట్ 2026లో పాత విధానం రద్దుపై అధికారికంగా తుది గడువును ప్రకటించే అవకాశం తక్కువగానే ఉంది. కానీ కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ.. పాత విధానాన్ని వాటంతట అవే కనుమరుగయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హోమ్ లోన్లు తీరిపోవడం, పాత ఇన్సూరెన్స్ పాలసీలు ముగియడంతో క్రమంగా ట్యాక్స్ పేయర్లు కొత్త విధానానికి మారుతారని ట్యాక్స్ ప్రొఫెషనల్ సచిన్ గార్గ్ అభిప్రాయపడ్డారు. అంటే ప్రభుత్వం రద్దు చేయకపోయినా, పాత విధానం కాలక్రమేణా తన ప్రాముఖ్యతను కోల్పోనుంది.

ట్యాక్స్ పేయర్లు ఏం చేయాలి?

మీరు ప్రస్తుతం పాత పన్ను విధానంలో ఉండి.. భారీగా పెట్టుబడులు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కడుతుంటే ఇప్పుడే తొందరపడి కొత్త విధానానికి మారాల్సిన అవసరం లేదు. బడ్జెట్ 2026లో వచ్చే మార్పులను గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా, వచ్చే నాలుగైదు ఏళ్లలో కొత్త పన్ను విధానమే ప్రధానమైన ట్యాక్స్ సిస్టమ్‌గా మారుతుందన్నది వాస్తవం. ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని పెంచుకుంటూనే, సామాన్యుడికి ట్యాక్స్ ఫైలింగ్ సులభం చేయాలని చూస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story