Billionaires : భారతదేశంలో అత్యంత ధనవంతులైన సూపర్ రిచ్ సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఊహించని రీతిలో పెరిగింది. దేశంలో రూ.100 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారి సంఖ్య గత ఐదేళ్ల కాలంలో నాలుగు రెట్లు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు తెలిపారు. పార్లమెంట్‌లో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఆసక్తికర గణాంకాలను వెల్లడించారు. ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన నివేదికల ఆధారంగా ఈ వివరాలను సేకరించినట్లు ఆయన స్పష్టం చేశారు.

5 ఏళ్లలో 4 రెట్లు పెరిగిన అత్యధిక ఆదాయపరులు

ఆదాయపన్ను రిటర్నుల ప్రకారం.. అస్సెస్మెంట్ ఇయర్ 2025-26 లో ఏకంగా 576 మంది పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక మొత్తం ఆదాయం రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అని ప్రకటించారు. అస్సెస్మెంట్ ఇయర్ 2021-22 లో ఈ సంఖ్య కేవలం 142 మంది మాత్రమే ఉండేది. అంటే ఐదేళ్ల వ్యవధిలోనే శతకోటీశ్వరుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ఇక 2022-23లో 301 మంది, 2023-24లో 284 మంది, 2024-25లో 415 మంది రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని చూపించారని మంత్రి వివరించారు. ఐటీ చట్టంలో బిలియనీర్ లేదా అరబ్‌పతి అనే పదానికి చట్టబద్ధమైన నిర్వచనం లేదని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆదాయ అసమానతలపై సర్కార్ విశ్లేషణ

సంపద కేంద్రీకరణ, ఆదాయ వ్యత్యాసాలపై స్పందించిన మంత్రి పంకజ్ చౌదరి, దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం, 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో నిరుద్యోగిత రేటు 2022లోని 3.6 శాతం నుంచి 2025 నాటికి 3.1 శాతానికి తగ్గింది. అలాగే ఇటీవల వచ్చిన హౌస్‌హోల్డ్ కన్సప్షన్ ఎక్స్‌పెండిచర్ సర్వే ప్రకారం ఆదాయ అసమానతలను కొలిచే గిని కోఎఫీషియంట్ సూచీ గ్రామీణ ప్రాంతాల్లో 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.284కు తగ్గిందని, ఇది అసమానతలు తగ్గుతున్నాయనడానికి సంకేతమని వివరించారు.

పేదరికం నుంచి బయటపడిన కోట్లాది మంది

నీతి ఆయోగ్ విడుదల చేసిన మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదికల ప్రకారం.. దేశంలో బహుళ కోణాల పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16 మరియు 2019-21 మధ్య కాలంలో పేదరికం 24.85 శాతం నుంచి 14.96 శాతానికి తగ్గి, దాదాపు 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి పేర్కొన్నారు. అలాగే 2013-14లో 29.17 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 11.28 శాతానికి పడిపోయిందని, మొత్తంగా 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. పేదరికాన్ని తగ్గించడానికి, సమగ్ర అభివృద్ధి కోసం ఉచిత రేషన్, ఆరోగ్య భద్రత, విద్య, గృహ నిర్మాణం, సోషల్ సెక్యూరిటీపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story