Byju's : ప్రముఖ భారతీయ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ అధినేత బైజూ రవీంద్రన్‌కు ఊహించని షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో సింగపూర్ న్యాయస్థానం ఆయనకు 6 నెలల కఠిన జైలు శిక్ష విధిస్తూ బుధవారం మే 27న సంచలన తీర్పు చెప్పింది. జైలు శిక్షతో పాటు 90,000 సింగపూర్ డాలర్ల (సుమారు రూ.55 లక్షలకు పైగా లేదా 70,500 యూఎస్ డాలర్లు) భారీ జరిమానాను కూడా కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యా రంగంలో విప్లవం సృష్టించి, బిలియనీర్‌గా ఎదిగిన రవీంద్రన్ జీవితంలో ఇది అత్యంత ఘోరమైన సంక్షోభంగా నిలిచింది.

ఏడాది కాలంగా తన వ్యక్తిగత, కార్పొరేట్ ఆస్తుల వివరాలకు సంబంధించి సింగపూర్ కోర్టు ఇచ్చిన పలు కీలక ఆదేశాలను బైజూ రవీంద్రన్ బేఖాతరు చేస్తూ వస్తున్నారు. ఈ తీవ్ర ధిక్కరణను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కఠిన వైఖరిని అవలంబించింది. రవీంద్రన్ వెంటనే అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జరిమానా మొత్తాన్ని తక్షణమే చెల్లించడంతో పాటు, వివాదాస్పద బీఆర్ ఇన్వెస్ట్ కో ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన యాజమాన్య పత్రాలను కోర్టుకు సమర్పించాలని డెడ్‌లైన్ విధించింది.

ఈ హైప్రొఫైల్ కేసు వెనుక ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీకి చెందిన ఒక అనుబంధ సంస్థ ఉంది. బైజూస్ కంపెనీ తీవ్ర ఆర్థిక నష్టాలు, ఉద్యోగుల తొలగింపులతో సతమతమవుతున్న సమయంలో ఈ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయింది. ఈ లీగల్ బ్యాటిల్‌లో ఖతార్ హోల్డింగ్స్ తరఫున ప్రసిద్ధ లా ఫర్మ్ డ్రూ అండ్ నేపియర్ గట్టి వాదనలు వినిపించగా, రవీంద్రన్ గ్రూప్ తరఫున ఫర్వెంట్ ఛాంబర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. చివరకు కోర్టు విదేశీ ఇన్వెస్టర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఈ శిక్ష ఖరారు చేసింది.

రవీంద్రన్ చుట్టూ ఉన్న లీగల్ ఉచ్చు కేవలం సింగపూర్‌కే పరిమితం కాలేదు. అమెరికాలో కూడా ఆయనపై భారీ ఎత్తున కేసులు నడుస్తున్నాయి. అక్కడ అంతర్జాతీయ రుణదాతలు తమకు రావాల్సిన 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 వేల కోట్లు) మెగా లోన్ రికవరీ కోసం బైజూస్ మాతృ సంస్థ అయిన థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ పై తీవ్రమైన న్యాయపోరాటం చేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లను నమ్మించి వేల కోట్లు కొల్లగొట్టి గ్లోబల్ బిలియనీర్‌గా చలామణి అయిన రవీంద్రన్ సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కొక్కటిగా కుప్పకూలుతోంది.

అయితే ఈ సంచలన తీర్పు వెలువడిన తర్వాత కూడా బైజూ రవీంద్రన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్పందించలేదు. అన్నింటికంటే పెద్ద సస్పెన్స్ ఏంటంటే.. అసలు రవీంద్రన్ ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారా లేక అరెస్ట్ భయంతో వేరే ఏదైనా విదేశీ దేశంలో దాక్కున్నారా అనే విషయంపై ఎవరికీ పక్కా సమాచారం లేదు. భారతీయ స్టార్టప్ ప్రపంచంలో ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన వ్యక్తి, ఇలా అర్షం నుండి ఫర్షానికి పడిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story