Stock Market : నాడు మారుతి.. నేడు జియో, ఎన్‌ఎస్‌ఈ.. స్టాక్ మార్కెట్ హిస్టరీ రిపీట్ అవుతుందా
స్టాక్ మార్కెట్ హిస్టరీ రిపీట్ అవుతుందా

Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీల ఐపీఓల సందడి త్వరలోనే షురూ కానుంది. ఇన్వెస్టర్లు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ ఐపీఓల ప్రత్యేకత వాటి భారీ సైజ్ మాత్రమే కాదు, ప్రస్తుతం మార్కెట్ ఉన్న పరిస్థితులు కూడా. గత రెండేళ్లుగా భారతీయ స్టాక్ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న వేళ ఈ మెగా ఐపీఓలు వస్తున్నాయి. దీంతో ఇవి మార్కెట్‌ను మళ్లీ లాభాల బాట పట్టిస్తాయా అనే చర్చ నడుస్తోంది.
23 ఏళ్ల నాటి మారుతి సుజుకి చరిత్ర
ఈ నేపథ్యంలో మార్కెట్ విశ్లేషకులు 23 సంవత్సరాల క్రితం నాటి ఒక ఆసక్తికరమైన హిస్టరీని గుర్తు చేసుకుంటున్నారు. 2003-04 ఆర్థిక సంవత్సరంలో దేశంలో మారుతి సుజుకి ఐపీఓ వచ్చినప్పుడు కూడా భారతీయ మార్కెట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా డాట్-కామ్ బబుల్ క్రాష్ , భారతదేశంలో కేతన్ పరేఖ్ స్టాక్ మార్కెట్ కుంభకోణం కారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్ పై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అలాంటి గడ్డు కాలంలో ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి ఐపీఓ.. సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లలో సరికొత్త నమ్మకాన్ని నింపింది. ఆ ఐపీఓ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, 2003 నుంచి 2007 వరకు భారత మార్కెట్ సుదీర్ఘమైన బుల్ రన్ సాధించడానికి పునాది వేసింది.
ప్రస్తుత మార్కెట్ సవాళ్లు, ఇన్వెస్టర్ల పరిస్థితి
ప్రస్తుతం దలాల్ స్ట్రీట్ దాదాపు 2003 నాటి పరిస్థితులనే ప్రతిబింబిస్తోంది. గత రెండేళ్లలో సాధారణ ఇన్వెస్టర్లకు పెద్దగా రిటర్న్స్ రాలేదు. పైగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొన్ని పెద్ద ఐపీఓలు కూడా ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితిని అధిగమించడానికి జియో మరియు ఎన్‌ఎస్‌ఈ కంపెనీలు తమ ఐపీఓ ధరలను చాలా రీజనబుల్‌గా, అంటే తక్కువ వాల్యుయేషన్‌తో కస్టమర్ల ముందుకు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు అందుబాటులో ఉంటే ఇన్వెస్టర్లకు లిస్టింగ్ లాభాలు వచ్చేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది.
మార్కెట్ కింగ్స్ గా జియో, ఎన్‌ఎస్‌ఈ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు సైతం ఈ రెండు ఐపీఓల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జియో, ఎన్‌ఎస్‌ఈలు తమ తమ రంగాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే. టెలికాం, డిజిటల్ రంగంలో జియో నంబర్ వన్ స్థానంలో ఉండగా, దేశీయ స్టాక్ ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ లీడర్‌గా ఉంది. ఈ రెండు రంగాలలోకి కొత్త కంపెనీలు వచ్చి వీటికి పోటీ ఇవ్వడం అంత సులువైన విషయం కాదు. అందువల్ల ఈ కంపెనీల బిజినెస్ మోడల్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ బలమైన పునాదే మార్కెట్ లో మళ్లీ కొత్త జోష్ నింపుతుందని కొందరు నిపుణులు బలంగా నమ్ముతున్నారు.
అసలైన సవాల్ విదేశీ పెట్టుబడులే
ముగింపుగా చూసుకుంటే, ఈ రెండు ఐపీఓలు వంద శాతం సబ్‌స్క్రైబ్ అవుతాయా లేదా అనేది ఇక్కడ అసలు ప్రశ్న కాదు. ఎందుకంటే ఈ బ్రాండ్ల క్రేజ్ దృష్ట్యా ఇవి ఈజీగా సబ్‌స్క్రైబ్ అయిపోతాయి. కానీ, అసలైన సవాల్, బాధ్యత ఏంటంటే.. భారత మార్కెట్ నుంచి దూరంగా వెళ్లిన విదేశీ ఇన్వెస్టర్లను ఈ ఐపీఓలు మళ్లీ ఆకర్షించగలవా లేదా అనేది. నాడు మారుతి ఐపీఓ దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచితే.. నేడు రాబోతున్న జియో, ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలు అంతర్జాతీయ వేదికపై భారతీయ మార్కెట్ సత్తాను చాటి, గ్లోబల్ ఇన్వెస్టర్లను మళ్లీ భారత్ వైపు అడుగులు వేయించాల్సి ఉంటుంది. అదే కనుక జరిగితే భారత స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

