New Labour Law Rules : సెలవు రోజున బాస్ ఫోన్ చేస్తున్నారా? కొత్త లేబర్ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసా ?
కొత్త లేబర్ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలుసా ?

New Labour Law Rules : ఆఫీసు పని ఒత్తిడిలో పడి చాలా మంది ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కనీసం సెలవు రోజులను కూడా ఆస్వాదించలేకపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కడ బాస్ నుంచి ఫోన్ వస్తుందో, ఏ మెయిల్ వస్తుందో అని భయపడే పరిస్థితి. మరి చట్టప్రకారం సెలవు రోజున బాస్ ఫోన్ చేసి పని చేయమని అడగవచ్చా? ఒకవేళ చేస్తే ఉద్యోగికి ఉన్న హక్కులేంటి? కొత్త లేబర్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఓసారి క్లియర్ గా తెలుసుకుందాం.
సెలవు రోజు పని.. చట్టం ఏమంటోంది?
భారతదేశంలో కార్పొరేట్ సంస్కృతి పెరిగిన తర్వాత సెలవు రోజుల్లో కూడా పనిచేయించుకోవడం కామన్ అయిపోయింది. అయితే, చట్టపరంగా చూస్తే.. వీక్లీ హాలిడేస్ యాక్ట్ 1942, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం ప్రతి ఉద్యోగికి ఆరు రోజులు పనిచేసిన తర్వాత ఒక రోజు తప్పనిసరిగా విశ్రాంతి లభించాలి. ఇది ఉద్యోగికి కల్పించిన కనీస హక్కు. కొత్తగా రాబోతున్న OSH కోడ్, 2020 ప్రకారం కూడా వారం వారం సెలవు అనేది తప్పనిసరి. ఉద్యోగి అంగీకారం లేకుండా, ఎటువంటి అదనపు వేతనం ఇవ్వకుండా సెలవు రోజున పని చేయమని బలవంతం చేయడం చట్టవిరుద్ధం.
ఒకవేళ పని చేస్తే.. మీకు దక్కాల్సినవి ఏంటి?
కంపెనీ అవసరాల రీత్యా లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సెలవు రోజున పని చేయాల్సి వస్తే, కంపెనీలు కొన్ని నియమాలను పాటించాలి.
* కాంపెన్సేటరీ ఆఫ్ : సెలవు రోజున పని చేసినందుకు బదులుగా ఆ వారంలో లేదా తర్వాత మరో రోజు సెలవు ఇవ్వాలి.
* ఓవర్ టైం లేదా అదనపు వేతనం: సెలవు రోజున లేదా నిర్ణీత పని గంటల కంటే ఎక్కువ సమయం పని చేస్తే, దానికి రెట్టింపు వేతనం చెల్లించాలి.
* ముందస్తు నోటీసు: ఒకవేళ ముందుగా మంజూరు చేసిన సెలవును రద్దు చేయాలంటే, కనీసం రెండు వారాల ముందుగా సమాచారం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ఆధారాలు దాచుకోవడం ముఖ్యం
చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం పోతుందనే భయంతో సెలవుల్లో కూడా బాస్ చెప్పిన పనిని మౌనంగా చేసేస్తుంటారు. అయితే, భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే చట్టపరంగా పోరాడటానికి డాక్యుమెంటేషన్ చాలా అవసరమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. సెలవు రోజున మీకు పని అప్పగించినప్పుడు దానికి సంబంధించిన ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు లేదా కాల్ రికార్డింగ్‌లను భద్రపరచుకోవాలి. ఒకవేళ బాస్ బలవంతం చేస్తే, మీరు సెలవులో ఉన్న విషయాన్ని మర్యాదపూర్వకంగా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం మంచిది.
కంపెనీల వాదన ఎలా ఉంటుంది?
మరోవైపు కంపెనీలు తమ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టులలోనే బిజినెస్ అవసరాల రీత్యా అదనపు గంటలు పనిచేయాల్సి ఉంటుంది అనే క్లాజ్‌ను పెడుతుంటాయి. దీనిని అడ్డం పెట్టుకుని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తుంటాయి. అయితే ఏ క్లాజ్ ఉన్నా అది దేశంలోని ప్రాథమిక లేబర్ చట్టాలను అతిక్రమించకూడదు. ప్రస్తుతం కొత్త లేబర్ కోడ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, ఇవి అమల్లోకి వస్తే పని గంటలు, సెలవులు, ఓవర్ టైం చెల్లింపుల విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సెలవు రోజున బాస్ ఫోన్ చేయడం పూర్తిగా నేరం కాకపోయినా, దానికి తగిన పరిహారం ఇవ్వకుండా పనిచేయించుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే.

