MS Dhoni : కెప్టెన్ కూల్ మాస్టర్ స్ట్రోక్.. మైదానంలోనే కాదు బిజినెస్ ప్రపంచంలోనూ ధోనీనే రారాజు
ధోనీనే రారాజు

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినపడని రోజంటూ ఉండదు. దేశానికి 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి చిరస్మరణీయ విజయాలను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జూలై 7న తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు. అయితే ఈ శుభసందర్భంగా ధోనీలోని అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాల గురించే కాకుండా, ఆయనలోని చురుకైన బిజినెస్ మైండ్ గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మైదానంలో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసిన కెప్టెన్ కూల్, వ్యాపార సామ్రాజ్యంలోనూ అదే స్థాయి మాస్టర్ స్ట్రోక్స్‌తో దూసుకుపోతున్నారు.
ఎంఎస్ ధోనీ రియల్ సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చేతిలో టికెట్లు పట్టుకుని తిరిగిన ఒక సాధారణ యువకుడు, ఈరోజు రూ.1200 కోట్ల భారీ ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారంటే అది ఆయన క్రమశిక్షణ, స్మార్ట్ డీల్స్, గత 18 ఏళ్లుగా చేసిన సరైన పెట్టుబడుల వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం 2026 నాటికి ధోనీ మొత్తం ఆస్తి విలువ దాదాపు 1,060 కోట్ల నుంచి 1,200 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని అంచనా. ఆయన ఐపీఎల్ జీతం, 30కి పైగా టాప్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు, బైకులతో కూడిన గ్యారేజ్ ఆయన నెట్‌వర్త్‌లో భాగమే. అయితే ఇతర క్రికెటర్ల లాగా కేవలం ప్రకటనల ద్వారా డబ్బు సంపాదించకుండా, కంపెనీలలో ఓనర్‌షిప్ తీసుకోవడం ధోనీని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది.
కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు
ధోనీ బిజినెస్ పోర్ట్‌ఫోలియో చాలా పెద్దది. ఆయన కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడమే కాకుండా పలు కీలక స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి వాటి ఎదుగుదలకు కారణమయ్యారు. అందులో ముఖ్యమైనది సెవెన్ అనే అథ్లెటిక్ ఫుట్‌వేర్ బ్రాండ్. దీనికి ధోనీ కో-ఓనర్‌గా ఉన్నారు. ఇటీవలే అంటే జనవరి 2026 లో ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ ఫిలా ఈ కంపెనీలో 51 శాతం వాటాను సుమారు 240 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనిని బట్టి ధోనీ వ్యక్తిగత ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఈ బ్రాండ్‌కు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే తన భార్య సాక్షితో కలిసి ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమా, డిజిటల్ కంటెంట్ రంగంలోనూ రాణిస్తున్నారు.
ధోనీ జాక్‌పాట్ స్టార్టప్స్
ధోనీ ఇన్వెస్ట్ చేసిన మరో సంచలన స్టార్టప్ గరుడ ఏరోస్పేస్. ఈ డ్రోన్ టెక్నాలజీ కంపెనీలో ధోనీ కేవలం 4 కోట్ల పెట్టుబడితో 1.1 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ కంపెనీ రీసెంట్‌గా రూ. 2100 కోట్ల వాల్యుయేషన్‌తో భారీగా నిధులను సేకరించింది. త్వరలోనే ఈ కంపెనీ ఐపీఓకి వెళ్లనుండటంతో, ధోనీ షేర్ల విలువ రూ.30 కోట్లకు పైగా దాటే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ ఈ-మోటోరాడ్, సెకండ్ హ్యాండ్ కార్ల ప్లాట్‌ఫారమ్ కార్స్ 24, హోమ్ ఇంటీరియర్ కంపెనీ హోమ్‌లేన్, క్లౌడ్ కిచెన్ హౌస్ ఆఫ్ బిర్యానీ, క్రాఫ్ట్ బెవరేజ్ బ్రాండ్ క్యాప్టెన్ 7లలో కూడా ధోనీకి పెద్ద మొత్తంలో వాటాలు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ పేరుతో జిమ్‌ల చైన్‌ను నడుపుతున్నారు.
వ్యవసాయంలోనూ మహి మార్క్
వ్యాపారాలతో పాటు ధోనీకి ప్రకృతి అన్నా, వ్యవసాయం అన్నా ఎంతో మక్కువ. రాంచీ సమీపంలో ధోనీకి 43 ఎకరాల భారీ ఆర్గానిక్ ఫామ్‌ల్యాండ్ ఉంది. ఇందులో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను పూర్తి సహజసిద్ధమైన పద్ధతుల్లో పండిస్తారు. ఈ ఏడాది అంటే 2026 లో ఈ ఫామ్ నుండి దుబాయ్, యూఏఈ వంటి అరబ్ దేశాలకు ఆర్గానిక్ పంటల ఎగుమతులు కూడా ప్రారంభమవడం విశేషం. అంతేకాకుండా హాస్పిటాలిటీ రంగంలో రాంచీలోనే హోటల్ మాహి రెసిడెన్సీని, అలాగే విద్యా రంగంలో బెంగళూరులో MS ధోనీ గ్లోబల్ స్కూల్‌ను కూడా ఆయన స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
రాంచీలో 7 ఎకరాల ఫార్మ్‌హౌస్
కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ధోనీ తన సొంత ఊరైన రాంచీలోనే ఉండటానికి ఇష్టపడతారు. రాంచీ రింగ్ రోడ్డు పక్కన సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో 2017 లో నిర్మించిన కైలాసపతి అనే లగ్జరీ ఫార్మ్‌హౌస్ ధోనీ ప్రధాన నివాసం. రూ. 6 నుంచి 10 కోట్ల విలువ చేసే ఈ ఫార్మ్‌హౌస్‌లో ఒక ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ప్రొఫెషనల్ జిమ్, నెట్ ప్రాక్టీస్ ఏరియా ఉన్నాయి. అలాగే ధోనీకి ఉన్న వింటేజ్ కార్లు, సూపర్‌బైక్‌ల కలెక్షన్ కోసం గాజు గోడలతో ఒక ప్రత్యేకమైన భారీ బిల్డింగ్‌ను నిర్మించారు. ఈ ఫార్మ్‌హౌస్‌తో పాటు డెహ్రాడూన్‌లో రూ. 17.8 కోట్ల విలువైన ఇల్లు, ముంబైలో ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్, పూణేలో ఒక లగ్జరీ పెంట్‌హౌస్ కూడా ధోనీ సొంతం. ఎన్ని నగరాల్లో ఆస్తులున్నా రాంచీలోనే సాదాసీదాగా గడపడం ధోనీ వ్యక్తిత్వానికి నిదర్శనం.

