లేదంటే నడిరోడ్డుపై నరకమే

Car Tyre Safety : గాలి కనపడదు కానీ ప్రాణానికి ఆధారం..అలాగే కారు టైర్లు బయటకు మామూలుగానే కనిపిస్తాయి కానీ ప్రయాణీకుల ప్రాణాలకు అవే రక్షణ కవచాలు. మనం ఇంజన్ ఆయిల్ మార్చడం, సర్వీసింగ్ చేయించడంపై చూపించే శ్రద్ధ టైర్ల విషయంలో చూపం. కానీ, తరిగిపోయిన టైర్లతో ప్రయాణించడం అంటే మృత్యువుతో చెలగాటమాడటమే. మరి మీ కారు టైర్లు ఎప్పుడు మార్చాలి? వాటి లైఫ్ అయిపోయిందని ఎలా గుర్తించాలి? ఆ వివరాలు తెలుసుకుందాం.

చాలా మంది టైర్లు అరిగిపోతేనే మార్చాలని అనుకుంటారు. కానీ, అది తప్పు. కారు వాడినా, వాడకపోయినా టైర్ల వయసు 5 నుంచి 6 ఏళ్లు దాటితే ఖచ్చితంగా మార్చేయాలి. ఎండ, గాలి ప్రభావం వల్ల రబ్బరు సహజంగానే గట్టిపడిపోయి పగుళ్లు వస్తాయి. మీ టైర్ ఎంత పాతదో తెలుసుకోవడానికి టైర్ పక్కన ఉండే DOT కోడ్‌ను గమనించండి. ఇందులో ఉండే చివరి నాలుగు అంకెలు ఆ టైర్ ఏ వారంలో, ఏ సంవత్సరంలో తయారైందో చెబుతాయి. ఉదాహరణకు 1224 అని ఉంటే, అది 2024వ సంవత్సరం 12వ వారంలో తయారైందని అర్థం.

టైర్ల మధ్య ఉండే గాడుల లోతు కనీసం 1.6 మిమీ ఉండాలి. దీనికంటే తక్కువగా ఉంటే వర్షం పడినప్పుడు కారు రోడ్డుపై పట్టు కోల్పోయి జారిపోయే ప్రమాదం ఉంది. టైర్లపై ఉండే ట్రెడ్ వేర్ ఇండికేటర్(TWI) అనే చిన్న గీతలను గమనించండి. టైర్ ఉపరితలం ఆ గీతల స్థాయికి వచ్చేస్తే వెంటనే కొత్త టైర్లు వేయించాలి. టైర్ల పక్క భాగంలో పగుళ్లు కనిపించినా, బుడిపెలు వచ్చినా అస్సలు ఆలస్యం చేయకండి. ఎందుకంటే అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇవే టైర్ పేలిపోయేలా చేస్తాయి.

సాధారణంగా ఒక టైర్ 40,000 నుండి 80,000 కిలోమీటర్ల వరకు వస్తుంది. కానీ మనం వాడే విధానాన్ని బట్టి ఇది మారుతుంది. టైర్ల లైఫ్ పెరగాలంటే ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్ రొటేషన్ (ముందు టైర్లను వెనక్కి మార్చడం) చేయాలి. అలాగే క్రమం తప్పకుండా వీల్ అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్ చేయించాలి. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, గుంతల రోడ్లపై అతివేగంగా వెళ్లడం వల్ల టైర్లు త్వరగా పాడవుతాయి. టైర్లలో గాలి ఎప్పుడూ సరైన పరిమాణంలో ఉండేలా చూసుకోవడం వల్ల మైలేజీ కూడా పెరుగుతుంది.

Updated On 5 Jan 2026 10:40 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story