Income Tax: బ్యాంక్ అకౌంట్లో ఎంత నగదు జమ చేయవచ్చు? 10 లక్షలు దాటితే ఇన్కమ్ టాక్స్ నోటీసు ఖాయమా?
ఇన్కమ్ టాక్స్ నోటీసు ఖాయమా?

Income Tax: పొదుపు ఖాతాలో నగదు జమ చేయడం మనందరికీ సాధారణ విషయమే. అయితే ఒక లిమిట్ దాటి నగదు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ కన్ను మీ ఖాతాపై పడుతుంది. అసలు ఎంత మొత్తం దాటితే బ్యాంకులు సమాచారం ఇస్తాయి? రూల్స్ ఏంటో పూర్తి వివరాలు చూద్దాం. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతాలో మొత్తం 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే బ్యాంకులు ఆ వివరాలను ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు నివేదిస్తాయి. ఒకేసారి 10 లక్షలు జమ చేయాల్సిన అవసరం లేదు. ఏడాది మొత్తం మీద వేర్వేరు విడతలుగా డిపాజిట్ చేసిన నగదు మొత్తాన్ని కలిపి లెక్క ఇస్తారు. నల్లధనం, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికే ప్రభుత్వం ఈ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.
10 లక్షలు దాటితే వెంటనే నోటీసు వస్తుందా?
ఖాతాలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసినంత మాత్రాన ఐటీ శాఖ వెంటనే నోటీసులు పంపదు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై సరైన ఆధారాలు మీ దగ్గర ఉండాలి. జీతం, వ్యాపార లాభాలు, అద్దె ఆదాయం లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఆయా ఆదాయాలకు సంబంధించిన రసీదులు, పే స్లిప్పులు, వ్యాపార రికార్డులు భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయమైతే దానికి తగినట్లుగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసి ఉండాలి.
రూ.50 వేలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి
ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనుకుంటే మీ పాన్ వివరాలు సమర్పించడం నిబంధన. ఒకవేళ పాన్ లేకపోతే ఫారమ్ 60 సమర్పించాల్సి ఉంటుంది. రోజువారీ పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై నిఘా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఒకే రోజులో ఏ వ్యక్తి నుంచి అయినా రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరించడం చట్టరీత్యా నేరం. విడతల వారీగా రసీదులు రాసి ఈ నిబంధన నుంచి తప్పించుకోవడం కుదరదు. రూల్ అతిక్రమిస్తే ఆ మొత్తానికి సమానమైన జరిమానా విధిస్తారు.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు జాగ్రత్తగా పరిశీలించుకోండి
మీ బ్యాంక్ ఖాతాలో తరచూ పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతుంటే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎంత నగదు డిపాజిట్ చేశారు, ఎంత విత్‌డ్రా చేశారనే లెక్క స్పష్టంగా ఉండాలి. సరైన ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాధానం చెప్పాల్సి రావచ్చు.
బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు, కానీ 10 లక్షల పరిమితి దాటినప్పుడు ఆదాయ మూలాలను స్పష్టంగా చూపించగలగాలి. సరైన ఆధారాలు, రికార్డులు నిర్వహించడం వల్ల ఐటీ శాఖ చిక్కుల నుంచి సులభంగా బయటపడవచ్చు.

