ఫైనాన్స్ ప్రపంచంలో అలజడి!

Anmol Ambani : భారత ఆర్థిక ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒక ముఖ్యమైన కేసు తెరపైకి వచ్చింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సంబంధించిన బ్యాంకింగ్ ఫ్రాడ్ ఆరోపణల దర్యాప్తు మరింత తీవ్రమైంది. ఈ కేసులో తొలిసారిగా అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీ పై సీబీఐ అధికారికంగా క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీనితో ఈ విషయంపై చర్చ తీవ్రమైంది.

ఈ కేసు ఎలా మొదలైంది ?

సీబీఐకి అందిన ఫిర్యాదు ప్రకారం.. ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ కార్యకలాపాలలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని, దీని కారణంగా సంబంధిత బ్యాంకుకు సుమారు రూ.228.06 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించబడింది. కంపెనీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేవలం నిబంధనలకు విరుద్ధంగానే కాకుండా, తప్పుడు మార్గాల్లో ఆర్థిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో తీసుకున్నారని ఆరోపణ. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో జై అన్మోల్ అంబానీతో పాటు, ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ మాజీ సీఈఓ, ఫుల్-టైమ్ డైరెక్టర్ రవీంద్ర సుధాళకర్, కొంతమంది గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతరుల పేర్లు కూడా ఉన్నాయి.

సీబీఐ నమోదు చేసిన కేసులు

ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సీబీఐ, మోసం, నేరపూరిత కుట్ర, పదవిని దుర్వినియోగం చేయడం వంటి సెక్షన్ల కింద FIR నమోదు చేసింది. లోన్ మంజూరు, చెల్లింపు, ఆర్థిక లావాదేవీలలో అనుమానాస్పద పాత్ర ఉన్న వారందరూ ఈ ఆరోపణల పరిధిలోకి వస్తారు. కంపెనీ మొత్తం ఆర్థిక నిర్మాణం, లోన్ ఖాతాలు, గత కొన్ని సంవత్సరాల అంతర్గత రికార్డులను పరిశీలించడానికి సీబీఐ సిద్ధమవుతోంది.

దర్యాప్తు ఎలా జరుగుతుంది?

దర్యాప్తు అధికారులు ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ పత్రాలు, బోర్డు నిర్ణయాలు, ఇంటర్నల్ ఈమెయిళ్ళు, లోన్ ఆమోదం ప్రక్రియలు, ఆడిట్ నివేదికలను సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తుంది. అవసరమైతే కంపెనీ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. లోన్ మంజూరు ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా నిబంధనలు సడలించారా, ఏ స్థాయిలో ఎవరు నిబంధనలను ఉల్లంఘించారు. బ్యాంకు నుంచి తీసుకున్న నిర్ణయాల వల్ల ఎవరికైనా వ్యక్తిగత లాభం జరిగిందా అనే అంశాలపై దర్యాప్తు దృష్టి సారిస్తుంది.

అంబానీ కుటుంబం స్పందన

అనిల్ అంబానీ గ్రూప్ తరపున ఈ కేసుపై ఇప్పటివరకు ఎలాంటి వివరణాత్మక ప్రకటన రాలేదు. అయితే దర్యాప్తు పెరిగే కొద్దీ కంపెనీ తరపున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అనిల్ అంబానీ కుటుంబ సభ్యులలో ఒకరిపై ఈ స్థాయిలో క్రిమినల్ చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి కాబట్టి, ఈ కేసు చాలా తీవ్రమైనదిగా పరిగణించబడుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story