Real Estate: నిర్మాణం నుంచి డిజైన్ వరకు అంతా ఏఐ మయం.. ఇండియాలో మారుతున్న రియల్ ఎస్టేట్
ఇండియాలో మారుతున్న రియల్ ఎస్టేట్

Real Estate: ఇల్లు అంటే సిమెంట్, ఇనుము, ఇటుకలు మాత్రమే అనుకునే భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఒక వినూత్న డిజిటల్ విప్లవానికి వేదికైంది. ప్రస్తుతం $650 బిలియన్లు (సుమారు రూ.62 లక్షల కోట్లు) ఉన్న ఈ భారీ మార్కెట్, ప్రాజెక్టుల ఆలస్యం, బడ్జెట్ లోటు, నిర్మాణ సామగ్రి వృథా వంటి సమస్యల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని గేమ్‌చేంజర్‌గా వాడుతోంది. AI వినియోగం కేవలం చాట్‌బోట్‌లు లేదా 3D వర్చువల్ టూర్లకే పరిమితం కాకుండా, బోర్డ్‌రూమ్‌ల నిర్ణయాల నుంచి నిర్మాణ స్థలాల నిర్వహణ వరకు విస్తరించింది.
సెక్టార్‌లోని భారీ మార్పులు - గణాంకాలు:
* $650 బిలియన్ల నుంచి $5.8 ట్రిలియన్లకు: IBEF నివేదిక ప్రకారం.. ప్రస్తుతం $650 బిలియన్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2047 నాటికి $5.8 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
* $14-17 బిలియన్ల అదనపు విలువ: EY-Parthenon, CREDAI సంయుక్త నివేదిక ప్రకారం, జనరేటివ్ AI రాబోయే 7 ఏళ్లలో రియల్ ఎస్టేట్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి 14 నుంచి 17 బిలియన్ డాలర్ల అదనపు లబ్ధిని చేకూర్చనుంది.
* 91% కంపెనీల ఆమోదం: JLL గ్లోబల్ టెక్నాలజీ సర్వే 2025 ప్రకారం, 2023లో కేవలం 5% కంటే తక్కువగా ఉన్న AI వాడకం, 2025 నాటికి ఏకంగా 91% కంపెనీలకు విస్తరించింది.
* వ్యయం, సమయం ఆదా: AI ఆధారిత మెటీరియల్ మేనేజ్‌మెంట్ వల్ల నిర్మాణ సామగ్రి వృథా 20% నుంచి 30% వరకు తగ్గగా, ప్రాజెక్ట్ లాంచ్, నిర్మాణ వేగం 30% నుంచి 50% వరకు పెరిగింది.
డెవలపర్లకు లభిస్తున్న ప్రధాన ప్రయోజనాలు
EY-Parthenon, CREDAI నివేదికల ప్రకారం.. AIని అమలు చేయడం ద్వారా డెవలపర్లు స్పష్టమైన పురోగతిని సాధిస్తున్నారు:
* అమ్మకాల వేగం: 30% నుంచి 50% పెరుగుదల.
* ప్రాజెక్ట్ లాంచ్ సమయం: 30% వేగంగా ప్రారంభం.
* వర్క్‌ఫోర్స్ ఉత్పాదకత: 20% నుంచి 50% మెరుగుదల.
* భూమి మూల్యాంకనం : 50% వరకు సమయం ఆదా.
* కస్టమర్ సేకరణ వ్యయం : 20% నుంచి 50% తగ్గుదల.
హోమ్‌బైయర్లకు లగ్జరీ, స్మార్ట్ అనుభవం
AI కేవలం నిర్మాణానికే కాక కొనుగోలుదారుల జీవనశైలిని కూడా మారుస్తోంది. స్మార్ట్ బయోమెట్రిక్ యాక్సెస్, ఫేస్ రికగ్నిషన్‌తో పనిచేసే లిఫ్టులు, ఏసీలు లేదా లిఫ్ట్‌లు పాడైపోక ముందే ముందస్తు మెయింటెనెన్స్ హెచ్చరికలు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటెలిజెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, పర్సనల్ లైటింగ్ ఆటోమేషన్ కూడా ఇళ్లలో భాగమవుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకునే డెవలపర్లు మాత్రమే వేగవంతమైన, సురక్షితమైన, ఆధునిక గృహాలను అందించగలరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

