VB-GRAM G : కేంద్ర ప్రభుత్వం బంపర్ అనౌన్స్మెంట్.. VB-GRAM G ప్రాజెక్టు కోసం రూ.95,692 కోట్ల భారీ నిధులు
VB-GRAM G ప్రాజెక్టు కోసం రూ.95,692 కోట్ల భారీ నిధులు

VB-GRAM G : భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. పల్లెల్లో రోడ్ల నిర్మాణం, డిజిటల్ కనెక్టివిటీ, పేదలకు పక్కా గృహాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏకంగా రూ.95,692 కోట్ల భారీ మధ్యంతర నిధులను కేటాయిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్‌గార్ ఎండ్ ఆజీవికా మిషన్(VB-GRAM G) అనే సరికొత్త ప్రతిష్టాత్మక పథకం కింద ఈ నిధులను విడుదల చేశారు.
మనరేగా స్థానంలో కొత్త విప్లవం.. పనులకు డోకా లేదు
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రాల గ్రామీణ అభివృద్ధి మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తాము వీబీ-జీ రామ్ జీ మిషన్ వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ మార్పు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పనులకు కానీ, కూలీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు రావద్దని అధికారులను ఆదేశించారు. కొత్త పథకం నియమ నిబంధనలు ఇంకా తుది దశలో రూపొందుతున్నాయని, అందుకే పనులు ఆగకుండా ఉండేందుకు ఈ భారీ మధ్యంతర నిధులను ముందే కేటాయించామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ కు సింహభాగం.. తెలుగు రాష్ట్రాలకు వాటా
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా రూ.9,721.48 కోట్లు దక్కాయి. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (రూ.8,508 కోట్లు), ఆంధ్ర ప్రదేశ్ (రూ.7,707.21 కోట్లు), తమిళనాడు (రూ.7,585.49 కోట్లు), రాజస్థాన్ (రూ.7,581.87 కోట్లు), బీహార్ (రూ.6,715.83 కోట్లు) నిలిచాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం మొత్తం రూ.92,550.17 కోట్లు కేటాయించగా.. కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.1,291.52 కోట్లు ఇచ్చారు. వీటితో పాటు కేంద్ర పరిపాలన, సామాజిక ఆడిట్ పర్యవేక్షణల కోసం అదనంగా రూ.1,850.62 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
నిధుల్లో ఎలాంటి కోత లేదు.. మంత్రి భరోసా
ఈ కొత్త స్కీమ్ కింద కేంద్ర నిధులతో పాటు రాష్ట్రాలు తమ వంతుగా అందించే వాటాను కూడా కలిపితే, వార్షిక మొత్తం ఖర్చు దాదాపు రూ.1.51 లక్షల కోట్లకు చేరుకుంటుందని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను ఆయన పటాపంచలు చేశారు. ఏ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లోనూ పైసా కూడా కోత పెట్టలేదని, గత ఏడాది మనరేగా కింద జరిగిన ఖర్చు ఆధారంగానే ఈ మధ్యంతర నిధులను పక్కాగా లెక్కగట్టి ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, మిజోరం మినహా మిగిలిన 26 రాష్ట్రాలు ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 4 రాష్ట్రాలు కూడా త్వరలోనే ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.
బెంగాల్ వివాదానికి తాత్కాలిక ముగింపు
గడిచిన కొన్నేళ్లుగా గ్రామీణ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తీవ్ర వివాదాలు నడుపుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవహారంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. బెంగాల్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం.. కేంద్రం పెట్టే అన్ని రకాల నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉంటామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని చౌహాన్ వెల్లడించారు. పాత బకాయిల వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదని, అవి తేలేవరకు పాత నిధుల ప్రస్తావన రాదని స్పష్టం చేశారు. అయితే, జూన్ 30 వరకు నడిచే ప్రస్తుత తాత్కాలిక కాలానికి గానూ పశ్చిమ బెంగాల్ కు రూ.700 కోట్ల మధ్యంతర నిధులు ఇచ్చామని, జూలై నెల నుంచి కొత్త VB-GRAM G పథకం కింద పూర్తిస్థాయి నిధులు అందుతాయని మంత్రి వివరించారు.

