తక్కువ వడ్డీకే రుణాలు

Salary Account : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారికి బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు సమగ్ర శాలరీ అకౌంట్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. దీని కోసం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (SBI, PNB, UBI మొదలైనవి) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని ఎ, బి, సి కేడర్లకు చెందిన ఉద్యోగులందరికీ ఈ కొత్త సదుపాయాలు వర్తిస్తాయి.

ఈ కొత్త శాలరీ అకౌంట్ ప్యాకేజీలో ప్రధానంగా జీరో బ్యాలెన్స్ సదుపాయం ఉంది. అంటే ఖాతాలో కనీస నగదు లేకపోయినా ఎలాంటి జరిమానాలు ఉండవు. దీనికి తోడు నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS), యూపీఐ (UPI) ద్వారా జరిపే లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితం. విదేశాల నుంచి వచ్చే నిధుల రవాణా పై కూడా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. ఇది ఉద్యోగులకు బ్యాంకింగ్ లావాదేవీల్లో భారీగా నగదును ఆదా చేస్తుంది.

రూ.2 కోట్ల వరకు భారీ ఇన్సూరెన్స్ కవరేజీ

ఈ ప్యాకేజీలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఉచిత ఇన్సూరెన్స్. ఉద్యోగులకు రూ.1.5 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.2 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. అంతేకాకుండా, రూ.20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ కూడా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగికి మరింత బీమా కావాలంటే, చాలా తక్కువ ప్రీమియంతో అదనపు కవరేజీని పొందే వెసులుబాటు కూడా కల్పించారు. దీనివల్ల ఉద్యోగి కుటుంబానికి పూర్తి స్థాయి సామాజిక భద్రత లభిస్తుంది.

చౌకగా రుణాలు.. కార్డులపై బోనస్ ఆఫర్లు

కేంద్ర ఉద్యోగులు ఇల్లు, కారు లేదా విద్య కోసం రుణాలు తీసుకోవాలనుకుంటే ఈ అకౌంట్ ద్వారా తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. లోన్ ప్రాసెసింగ్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, బ్యాంక్ లాకర్ అద్దెలో కూడా రాయితీలు పొందవచ్చు. ఫ్యామిలీ బ్యాంకింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనాలు అందుతాయి. డెబిట్, క్రెడిట్ కార్డులపై యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజు ఉండదు. ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రీమియం సదుపాయాలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story