Windfall Tax : సామాన్యులపై పెట్రోల్ భార పడిన తరుణంలోనే, కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతుల ద్వారా కంపెనీలు గడిస్తున్న అదనపు లాభాలపై నియంత్రణ విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.3 చొప్పున విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదే సమయంలో డీజిల్ మరియు విమాన ఇంధనం ఎగుమతిదారులకు మాత్రం కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. ఈ కొత్త నిబంధనలు మే 16 (శనివారం) నుంచే అమలులోకి రానున్నాయి.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు కంపెనీలు దేశీయంగా అమ్మడం కంటే, విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఎగుమతులను నిరుత్సాహపరచాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏదైనా కంపెనీ విదేశాలకు పెట్రోల్ పంపిస్తే, ప్రతి లీటరుపై రూ.3 అదనపు పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

పెట్రోల్ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం, డీజిల్, జెట్ ఫ్యూయల్ విషయంలో సానుకూలంగా స్పందించింది. డీజిల్ ఎగుమతులపై ఉన్న డ్యూటీని లీటరుకు రూ.23 నుంచి రూ.16.50కి తగ్గించింది. అలాగే విమాన ఇంధనం పై ఉన్న పన్నును రూ.33 నుంచి రూ.16కి భారీగా తగ్గించింది. దీనివల్ల రిఫైనరీ కంపెనీలకు, ఏవియేషన్ రంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది. యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిన పరిస్థితుల్లో మార్కెట్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. యుద్ధానికి ముందు 73 డాలర్లుగా ఉన్న ముడిచమురు, ఇప్పుడు 100 డాలర్ల పైనే ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని కంపెనీలు తమ స్వార్థానికి వాడుకోకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధనం సజావుగా అందేలా చూడటంతో పాటు, విదేశీ ఎగుమతుల ద్వారా వచ్చే అదనపు లాభాలను టాక్స్ రూపంలో ఖజానాకు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story