Check Bounce : చెక్ బౌన్స్ అయితే చిన్న విషయం కాదు.. జైలుకు వెళ్లాల్సిందే.. తస్మాత్ జాగ్రత్త
జైలుకు వెళ్లాల్సిందే.. తస్మాత్ జాగ్రత్త

Check Bounce : చాలామంది చెక్ బౌన్స్ అవ్వడాన్ని లేదా ఈఎంఐ ఆటో డెబిట్ ఫెయిల్ అవ్వడాన్ని చాలా చిన్న విషయంగా భావిస్తుంటారు. వచ్చే నెల కట్టేద్దాంలే అని లైట్ తీసుకుంటారు. కానీ అది ఎంత పెద్ద తప్పో, దాని వల్ల ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం జరిమానాతోనే అయిపోదు, కొన్నిసార్లు జైలు గోడల మధ్యకు కూడా వెళ్లాల్సి రావచ్చు. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చి, అది అకౌంట్లో డబ్బులు లేక బౌన్స్ అయితే, అవతలి వ్యక్తి మీకు లీగల్ నోటీసు పంపవచ్చు. నోటీసు అందిన 15 రోజుల్లోగా మీరు చెల్లింపు చేయకపోతే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (Section 138) కింద మీపై క్రిమినల్ కేసు నమోదవుతుంది. దీనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, లేదా చెక్ మొత్తానికి రెట్టింపు జరిమానా, లేదా కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం సివిల్ తగాదా కాదు, క్రిమినల్ నేరం అని గుర్తుంచుకోండి.
ఖరీదైన జరిమానాలు.. బ్యాంకుల వసూళ్లు
చట్టపరమైన చర్యల కంటే ముందే బ్యాంకుల పెనాల్టీలు మీ జేబును ఖాళీ చేస్తాయి. ప్రతిసారి చెక్ లేదా ఆటో-డెబిట్ (SIP లేదా EMI) ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు రూ.250 నుంచి రూ.750 వరకు చార్జ్ చేస్తాయి. ఇక లోన్ ఇచ్చే కంపెనీలు లేట్ ఫీజు, బౌన్స్ చార్జీలు, దానిపై వడ్డీ అంటూ అదనంగా బాదుతాయి. ఒక నెలలో మూడుసార్లు మ్యాండేట్ ఫెయిల్ అయితే, మీరు ఏమీ కొనకపోయినా సుమారు రూ.3,000 వరకు నష్టపోవాల్సి వస్తుంది.
సిబిల్ స్కోర్‌పై చావుదెబ్బ
డబ్బుల కంటే పెద్ద నష్టం మీ క్రెడిట్ స్కోర్. ఒక్క EMI మిస్ అయినా బ్యాంకులు మిమ్మల్ని డిఫాల్టర్ కింద చూపిస్తాయి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ఒక్కసారిగా 50 నుంచి 70 పాయింట్లు పడిపోవచ్చు. ఒకసారి స్కోరు పడిపోతే, భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ కావాలంటే ఏ బ్యాంకు ముందుకు రాదు. ఒకవేళ ఇచ్చినా, భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. దీన్ని బ్యాంకులు మీ బిహేవియరల్ రిస్క్(ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం)గా పరిగణిస్తాయి.
టెక్నికల్ కారణాలైనా సరే.. రిస్క్ తప్పదు
కొన్నిసార్లు డబ్బులు ఉన్నా టెక్నికల్ సమస్యల వల్ల కూడా పేమెంట్లు ఫెయిల్ అవుతాయి. బ్యాంకు వివరాలు తప్పుగా ఉండటం, మ్యాండేట్ లిమిట్ తక్కువగా ఉండటం, లేదా బ్యాంకు మారినప్పుడు పాత వివరాలు అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. కారణం ఏదైనా సరే, రికార్డుల్లో అది బౌన్స్ కిందనే నమోదవుతుంది. అందుకే పేమెంట్ తేదీకి రెండు రోజుల ముందే అకౌంట్లో తగినంత సొమ్ము ఉండేలా చూసుకోవడం, వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ఉత్తమం.
ఇబ్బందుల నుంచి బయటపడటం ఎలా?
ఒకవేళ మీ దగ్గర నిజంగానే డబ్బులు లేక పేమెంట్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటే, ముందే మీ బ్యాంకుకు లేదా లోన్ సంస్థకు సమాచారం ఇవ్వండి. పేమెంట్ తేదీని మార్చమని లేదా కొద్దిరోజులు సమయం ఇవ్వమని రిక్వెస్ట్ చేయండి. మీరు ముందుగా సమాచారం ఇస్తే, ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడకుండా ఉంటుంది. దీనివల్ల చట్టపరమైన చిక్కుల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చు.

