Plastic Ban: పాన్ మసాలా ప్రియులకు షాక్.. ప్యాకేజింగ్‌పై FSSAI కఠిన నిబంధనలు.. పెరగనున్న ధరలు
పెరగనున్న ధరలు

Plastic Ban: పాన్ మసాలా ప్రియులకు, తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) పాన్ మసాలా ప్యాకేజింగ్‌కు సంబంధించి సరికొత్త, కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం పాన్ మసాలా ప్యాకింగ్‌లో ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్, మెటలైజ్డ్ లేయర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. FSSAI జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన వెంటనే తక్షణమే అమలులోకి వచ్చాయి.
ఏ పదార్థాలతో ప్యాకేజింగ్ చేయవచ్చంటే
కొత్త రూల్స్ ప్రకారం పాన్ మసాలా ప్యాకేజింగ్ కోసం పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్, సహజంగా తయారైన ఇతర మెటీరియల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. అయితే, ఈ పేపర్ ప్యాకింగ్ లోపల ఎలాంటి ప్లాస్టిక్, అల్యూమినియం లేదా మెటల్ లేయర్ ఉండకూడదు. పైన పేపర్ ఉండి లోపల ప్లాస్టిక్ పొర ఉన్నా కూడా అలాంటి ప్యాకేజింగ్ చెల్లదని FSSAI స్పష్టం చేసింది. పాలిథిన్, పాలిప్రొపైలీన్, పాలియేస్టర్, పీవీసీ లేదా ఇతర సింథటిక్ పాలిమర్లు, లామినేట్లను ప్యాకింగ్ కోసం ఉపయోగించడానికి వీల్లేదని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
గాజు, టిన్ డబ్బాలకు అనుమతి
ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా టిన్ డబ్బాలు, గాజు కంటైనర్లను ఉపయోగించడానికి FSSAI ఆమోదం తెలిపింది. అయితే టిన్, గాజు, పేపర్ ప్యాకేజింగ్ వాడటం వల్ల కంపెనీలకు తయారీ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ పెరిగిన భారకరమైన వ్యయాన్ని కంపెనీలు వినియోగదారుల పైనే వేసే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో పాన్ మసాలా ధరలు మరింత ప్రియం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం పాన్ మసాలా విక్రయాలు లేదా ఉత్పత్తిపై ఎలాంటి నిషేధం విధించలేదని, కేవలం ప్యాకేజింగ్ పదార్థాలను మాత్రమే మార్చిందని గ్రహించాలి.
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం
ఈ నిబంధనలను FSSAI అకస్మాత్తుగా ఏమీ అమలు చేయలేదు. ఏప్రిల్ 28, 2026న ఈ మార్పులకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి ప్రజలు, భాగస్వామ్య కంపెనీల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించడానికి 60 రోజుల సమయం ఇచ్చింది. వాటన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఈ తుది ఉత్తర్వులను జారీ చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా FSSAI ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

