Aadhaar Card: తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల ఆధార్‌లో ఈ పని చేయడానికి ఇంకా 20 రోజులే టైమ్
ఇంకా 20 రోజులే టైమ్

Aadhaar Card: చిన్నారుల ఆధార్ కార్డులకు సంబంధించి విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఐదేళ్ల వయస్సు దాటిన పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ గడువు ముగిస్తే తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మనదేశంలో పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి ఐడెంటిటీగా మారింది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు నీలిరంగు (బ్లూ) ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఈ వయస్సులో ఉన్న పిల్లల వేలిముద్రలు, ఐరీస్ గుర్తులు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవు. అందుకే ఎటువంటి బయోమెట్రిక్ వివరాలు లేకుండానే కేవలం తల్లిదండ్రుల ఆధారాల ఆధారంగా ఈ బాల ఆధార్‌ను అందిస్తారు. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత వారి శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి బయోమెట్రిక్స్ నమోదు చేయడం తప్పనిసరి.
ఉచిత అప్‌డేట్‌కు ముగుస్తున్న సమయం
ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరి బయోమెట్రిక్ సమాచారాన్ని ఆధార్ డేటాబేస్‌లో అప్‌డేట్ చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉచితంగా ఈ సేవలను పొందేందుకు UIDAI సెప్టెంబర్ 30, 2026 వరకు అవకాశం కల్పించింది. ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా తమ పిల్లలను సమీపంలోని ఈ-సేవ లేదా ఆధార్ సేవా కేంద్రానికి తీసుకెళ్లడం మంచిది. ఈ గడువు దాటితే ఉచిత సేవలు నిలిచిపోతాయి.
అప్‌డేట్ ప్రక్రియ.. పాటించాల్సిన పద్ధతి
పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ అప్‌డేట్ చేయడం చాలా సులువైన ప్రక్రియ. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పిల్లల పది వేలిముద్రలు, రెండు కంటిపాపల స్కాన్‌తో పాటు కొత్త ఫోటోను ఉచితంగా నమోదు చేస్తారు. అవసరమైతే జనన ధృవీకరణ పత్రం లేదా చిరునామా ఆధారాలను అధికారులకు అందించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల్లోగా కొత్తగా అప్‌డేట్ చేసిన ఆధార్ కార్డు అందుబాటులోకి వస్తుంది.
అప్‌డేట్ చేయకపోతే వచ్చే సమస్యలు
పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు లేదా స్కాలర్‌షిప్‌లు అందాలన్నా ఆధార్ బయోమెట్రిక్స్ సరిగ్గా ఉండటం అత్యవసరం. ఐదేళ్లు దాటినా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఆధార్ కార్డు తాత్కాలికంగా ఇన్-యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బ్యాంకు ఖాతాలు తెరవడం, పరీక్షలకు హాజరవడం వంటి విషయాల్లో పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

