15 రోజుల్లోనే రెండోసారి బాదుడు

Fuel Price Hike : మధ్యప్రాచ్యంలో అంటుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచ దేశాల ఇంధన గిడ్డంగులను దహించివేస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. గత రెండు వారాల్లోనే చైనా ప్రభుత్వం రెండోసారి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నడుస్తున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. చైనాలోని అత్యున్నత ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్‌మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (NDRC) మంగళవారం ఒక కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పుల వల్ల బుధవారం నుంచి దేశంలో పెట్రోల్ ధరలు టన్నుకు 420 యువాన్లు (సుమారు 61 డాలర్లు), డీజిల్ ధరలు 400 యువాన్లు (సుమారు 58 డాలర్లు) పెరుగుతాయని వెల్లడించింది. ఇప్పటికే మార్చి 23న ఒకసారి ధరలు పెంచిన ప్రభుత్వం, కేవలం రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ వాత పెట్టింది.

యుద్ధం తెచ్చిన ఇంధన కష్టాలు

ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చైనా తన ముడి చమురు అవసరాల కోసం 70 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ దాదాపు 45 శాతం వాటా హోర్ముజ్ జలసంధి గుండానే చైనాకు చేరుతుంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతే, చైనా మొత్తం ఇంధన సరఫరాలో 30 శాతం వాటా దెబ్బతింటుంది. అందుకే ముందు జాగ్రత్తగా ధరలను పెంచుతూ మార్కెట్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది.

నిఘా పెంచిన ప్రభుత్వం

చమురు ధరల పెంపుతో పాటు, మార్కెట్లో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. చైనాకు చెందిన మూడు ప్రధాన చమురు సంస్థలు (CNPC, Sinopec, CNOOC) ఉత్పత్తిని నిరంతరం కొనసాగించాలని, రవాణాలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా చూడాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

రష్యాతో దోస్తీ.. చైనాకు సేఫ్టీ

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే చైనాకు కొంత ఊరట ఉంది. చైనాకు రష్యాతో ఉన్న సుదీర్ఘకాల ఒప్పందాలు, సరిహద్దుల్లో ఉన్న గ్యాస్ పైప్‌లైన్లు ఇంధన భద్రతను కల్పిస్తున్నాయి. అంతేకాకుండా, చైనా వద్ద దాదాపు నాలుగు నెలలకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉండటం ఆ దేశానికి పెద్ద ప్లస్ పాయింట్. ఇంధన వినియోగంలో వైవిధ్యం ఉండటం వల్ల హోర్ముజ్ జలసంధి మూతపడినా చైనా తట్టుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story