భారత్ వెనక్కి తగ్గడంతో బీజింగ్ సరికొత్త రికార్డు

Russia China Oil : ప్రపంచ చమురు మార్కెట్లో చైనా తన పాత రికార్డులను తానే తిరగరాస్తోంది. రష్యా నుంచి లభిస్తున్న చౌక చమురు పై బీజింగ్ భారీగా పందెం కాసింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో, ఆ దేశం తన చమురును భారీ డిస్కౌంట్లకు విక్రయిస్తోంది. ఒకప్పుడు ఈ చౌక చమురును భారీగా కొనుగోలు చేసిన భారత్, ఇటీవలి కాలంలో కొన్ని సాంకేతిక, చెల్లింపుల కారణాల వల్ల వెనక్కి తగ్గింది. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న చైనా, రష్యా చమురు దిగుమతుల్లో చరిత్ర సృష్టించింది. ఫిబ్రవరి నెలలో చైనా దిగుమతులు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

షిప్పింగ్, ట్రేడింగ్ డేటా ప్రకారం.. ఫిబ్రవరి నెలలో చైనా రష్యా నుంచి ప్రతిరోజూ 20 లక్షల బ్యారెల్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. జనవరిలో ఇది 17 లక్షల బ్యారెల్లుగా ఉండగా, కేవలం ఒక్క నెలలోనే భారీ పెరుగుదల కనిపించింది. రష్యా చమురుకు అతిపెద్ద కస్టమర్‌గా ఉన్న భారత్‌ను చైనా నవంబర్ నుంచే వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం భారత్ దిగుమతులు రోజుకు 11.59 లక్షల బ్యారెళ్లకు పడిపోవడంతో, రష్యాకు చైనా ఇప్పుడు నెంబర్ వన్ కస్టమర్‌గా మారిపోయింది.

చైనాలోని ప్రైవేట్ రిఫైనరీలను టీపాట్స్ అని పిలుస్తారు. ఇవి రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాల నుంచి ఆంక్షలతో కూడిన చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో సిద్ధహస్తులు. ప్రస్తుతం అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధరతో పోలిస్తే, రష్యా చమురు 9 నుంచి 11 డాలర్లు తక్కువకే లభిస్తోంది. ఇరాన్ చమురు కంటే రష్యా చమురు నాణ్యత బాగుండటం, పైగా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకపోవడంతో చైనా వ్యాపారులు రష్యా వైపే మొగ్గు చూపుతున్నారు.

చైనా ఇన్నాళ్లూ ఇరాన్ నుంచి కూడా భారీగా చమురును దిగుమతి చేసుకునేది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చైనా వ్యాపారులు భయపడుతున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఇరాన్ నుంచి సరఫరా ఆగిపోవచ్చు, కానీ రష్యాతో అలాంటి ఇబ్బంది లేదని వారు భావిస్తున్నారు. అందుకే ఇరాన్ చమురు దిగుమతులు జనవరిలో 1.25 మిలియన్ బ్యారెళ్ల నుంచి ఫిబ్రవరిలో 1.03 మిలియన్ బ్యారెళ్లకు తగ్గాయి. ఆ లోటును రష్యా చమురుతో చైనా భర్తీ చేస్తోంది.

రష్యా చమురు రవాణా చేసే నౌకలపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేయడంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా సోకోల్ గ్రేడ్ చమురు సరఫరాలో చెల్లింపుల సమస్యలు తలెత్తడం, రష్యా నౌకలను భారత నౌకాశ్రయాల్లో అనుమతించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో దిగుమతులు రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. భారత్ వెనక్కి తగ్గగానే, రష్యా తన యూరల్స్ గ్రేడ్ చమురును భారీ డిస్కౌంట్లతో చైనాకు మళ్లించింది. దీనివల్ల చైనాకు ఇంధన ఖర్చులు భారీగా తగ్గి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story