రోడ్డున పడుతున్న ఉద్యోగులు.. అసలు ఏం జరుగుతోంది?

China Economy: పక్కనే ఉన్న డ్రాగన్ కంట్రీ చైనా మెరిసే మెరుపుల వెనుక ఒక భయంకరమైన ఆర్థిక నిశ్శబ్దం దాగి ఉంది. బయట ప్రపంచానికి అంతా బాగున్నట్లు, ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతున్నట్లు చైనా ఫోజులు కొడుతున్నా.. లోపల మాత్రం సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతాల్లో కోతలు, పెరుగుతున్న నిరుద్యోగం, భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం వంటివి చైనా మధ్యతరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ది ఎపోక్ టైమ్స్ నివేదిక ప్రకారం చైనాలోని పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు కంపెనీలు మూతపడుతున్నాయి, వేల సంఖ్యలో ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారు. చైనా ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని పదేపదే చెప్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజలు తమ కష్టాలను బయటకు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ప్రభుత్వ నిఘా నీడలో పేరు మార్చుకుని తమ గోడును వెళ్లగక్కుతున్నారు. కోవిడ్-19 తర్వాత విదేశీ కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్ళిపోవడంతో నిరుద్యోగం రాకెట్ వేగంతో పెరిగింది. ఒకప్పుడు వెలిగిపోయిన ఐటీ, తయారీ రంగాలు ఇప్పుడు కుదేలయ్యాయి.

సగానికి పడిపోయిన జీతాలు

చైనాలోని బీహాయ్ నగరానికి చెందిన ఒక డాక్టర్ కథ అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది. గతంలో నెలకు 20,000 యువాన్లు సంపాదించే ఆయనకు ఇప్పుడు కేవలం 10,000 యువాన్లు మాత్రమే వస్తున్నాయి. అంటే ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఒక్క డాక్టర్లే కాదు, ఇంజనీర్లు, టీచర్లు, కార్మికులు ఇలా అందరి పరిస్థితి ఇదే. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు చైనాలో అతి పెద్ద సవాలుగా మారింది. కొత్త అవకాశాలు రాకపోగా, ఉన్న పనిలో కూడా ఎప్పుడు తొలగిస్తారో తెలియని అనిశ్చితి నెలకొంది.

ఖాళీ అవుతున్న ఖజానా

ఈ మందగమనం కేవలం ప్రైవేట్ రంగంలోనే కాదు, ప్రభుత్వ యంత్రాంగంపై కూడా కనిపిస్తోంది. స్థానిక ప్రభుత్వాల దగ్గర నిధులు లేక అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నారు. చెన్‌జౌ వంటి ప్రాంతాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. షాపింగ్ మాల్స్‌లో దుకాణాలు మూతపడుతున్నాయి, ఫ్యాక్టరీల గేట్లు తెరుచుకోవడం లేదు. ఇది చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

యువతలో నైరాశ్యం

చైనాలో ఇప్పుడు యువత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. డిగ్రీలు పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా నెలకు కేవలం 3,000 యువాన్ల వంటి అతి తక్కువ జీతాలకే పనిచేయాల్సి వస్తోంది. దీంతో యువతలో విరక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే చైనాలో లైయింగ్ ఫ్లాట్ అనే కొత్త సంస్కృతి మొదలైంది. అంటే.. ఇక ఈ పోటీలో తాము గెలవలేమని భావించి, కష్టపడటం మానేసి నిశ్శబ్దంగా ఉండిపోవడం. బాగా చదువుకున్న యువకులు కూడా డెలివరీ బాయ్స్ గా, క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నారు.

దేశాన్ని విడుస్తున్న ధనికులు

సామాన్యులు తిండి కోసం పోరాడుతుంటే, చైనాలోని సంపన్న వర్గాలు మాత్రం తమ ఆస్తులను, కుటుంబాలను విదేశాలకు తరలిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన ధనికులు సురక్షితమైన దేశాలకు వలస వెళ్తున్నారు. ఇది చైనా భవిష్యత్తుకు ప్రమాద ఘంటిక అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రంగుల చిత్రాలు చూపించినా, సామాన్యుడి జేబు ఖాళీ అవ్వడం, సంపన్నులు దేశాన్ని వీడటం చైనా ఆర్థిక పతనాన్ని స్పష్టం చేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story