లక్షల కోట్ల లాభాలతో ప్రపంచానికే సవాల్

China : ప్రపంచ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావుడి ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు చైనా నిశ్శబ్దంగా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఖనిజాలతో ప్రపంచాన్ని శాసించిన డ్రాగన్ దేశం, ఇప్పుడు తన రూటు మార్చింది. తన దేశంలోని హై-స్పీడ్ రైల్వే నెట్‌వర్క్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లి, దాని ద్వారా కళ్లు చెదిరే లాభాలను గడిస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఈ రైల్వే నెట్‌వర్క్‌ను మరో 19 శాతం పెంచాలని చైనా మాస్టర్ ప్లాన్ వేసింది.

60 వేల కిలోమీటర్ల లక్ష్యం

చైనా ప్రభుత్వ రైల్వే సంస్థ చైనా స్టేట్ రైల్వే గ్రూప్ తాజాగా ఒక భారీ ప్రకటన చేసింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే నెట్‌వర్క్‌ను 1,80,000 కిలోమీటర్లకు చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇందులో కేవలం హై-స్పీడ్ రైల్వే లైన్లే 60,000 కిలోమీటర్లు ఉండటం విశేషం. అంటే మొత్తం నెట్‌వర్క్‌లో మూడో వంతు బుల్లెట్ రైళ్లే అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం హై-స్పీడ్ రైల్వే లైన్లలో 70 శాతం ఒక్క చైనాలోనే ఉండటం గమనార్హం.

రికార్డు స్థాయిలో ఆదాయం

చైనాకు కేవలం రైల్వే ద్వారానే భారీగా ఆదాయం వస్తోంది. 2025లో ఈ వ్యవస్థ ద్వారా వచ్చిన ఆదాయం మొదటిసారిగా 1 ట్రిలియన్ యువాన్ల మార్కును దాటింది (సుమారు రూ.11 లక్షల కోట్లకు పైమాటే). గత ఏడాదితో పోలిస్తే ఇది 3.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేవలం ప్రయాణికులే కాదు, సరుకు రవాణా ద్వారా కూడా చైనా గట్టిగా సంపాదిస్తోంది. మధ్య ఆసియా మరియు ఐరోపా దేశాలకు సరుకు చేరవేసే మాల్‌గాడి రైళ్లు గత ఏడాది ఏకంగా 34,000 సార్లు తిరిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు చైనా నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో.

గాలి వేగంతో ప్రయాణం

ట్రాక్ విస్తరణతో పాటు టెక్నాలజీలోనూ చైనా అద్భుతాలు చేస్తోంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్ రైళ్ల డిజైన్,టెస్టింగ్‌లను రాబోయే ఐదేళ్లలో పూర్తి చేయనుంది. విదేశాల్లో కూడా చైనా తన రైల్వే ప్రాజెక్టులను వేగంగా విస్తరిస్తోంది. హంగేరీ, సెర్బియా, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ పథకం కింద కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని చైనా చేపట్టింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా దేశాలపై తన పట్టును మరింత బిగించాలని చైనా భావిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story