Cigarette Prices : పొగరాయుళ్లకు షాక్.. ఆకాశమే హద్దుగా పెరిగిన సిగరెట్ ధరలు
ఆకాశమే హద్దుగా పెరిగిన సిగరెట్ ధరలు

Cigarette Prices : పొగ తాగే అలవాటు ఉన్నవారి జేబులకు చిల్లు పడనుంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధించడమే కాకుండా, సవరించిన జీఎస్‌టీ నిబంధనల ప్రకారం సిన్ గుడ్స్(అనారోగ్యకర ఉత్పత్తులు)పై పన్నును 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచింది. దీని ప్రభావం ఇప్పుడు రిటైల్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రముఖ బ్రాండ్లయిన గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ ధరలు మునుపెన్నడూ లేనంతగా ఆకాశాన్ని తాకాయి. నివేదికల ప్రకారం.. వీటి ధరలు 19 శాతం నుంచి 41 శాతం వరకు పెరిగాయి. ఉదాహరణకు గతంలో రూ.170 కి లభించే 10 సిగరెట్ల గోల్డ్ ఫ్లేక్ ప్యాక్ ధర ఇప్పుడు ఏకంగా రూ.240 కి చేరింది. అలాగే 20 సిగరెట్ల క్లాసిక్ ప్యాక్ ధర రూ.340 నుంచి రూ.480కి పెరిగింది. సామాన్యులు వాడే గోల్డ్ ఫ్లేక్ సూపర్‌స్టార్ వాల్యూ ప్యాక్ కూడా రూ.59 నుంచి రూ.70 కి చేరింది. అంటే ఒక్కో సిగరెట్‌పై దాదాపు రూ.2 నుంచి రూ.11 వరకు భారం పడింది.
వ్యాపారులు కూడా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. కొత్త స్టాక్ మార్కెట్లోకి రాకముందే పాత స్టాక్‌ను కూడా పెరిగిన రేట్లకు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం సిగరెట్లు మాత్రమే కాదు, గొడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా వంటి కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను సవరించాయి. పొగాకు వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ధరల పెరుగుదల వార్తలతో స్టాక్ మార్కెట్‌లో పొగాకు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు దాదాపు 2 శాతం పెరగగా, గొడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ షేర్లు ఏకంగా 10 శాతానికి పైగా లాభపడ్డాయి. ధరలు పెరగడం వల్ల కంపెనీల ఆదాయం పెరుగుతుందనే అంచనాతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి, ధూమపానం ఇప్పుడు ఆరోగ్యానికే కాదు, జేబుకు కూడా చాలా ప్రమాదకరంగా మారింది.

