Cigarette Prices : ధూమపానం చేసేవారికి చేదువార్త. మే నెల రాకముందే సిగరెట్ సెగలు మొదలయ్యాయి. దేశంలోని దిగ్గజ సిగరెట్ తయారీ సంస్థలైన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. పెరిగిన పన్నులు, ముడిసరుకు భారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో సామాన్యుడి నుంచి ప్రీమియం బ్రాండ్ల వరకు అందరి జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2025ను ఆమోదించిన తర్వాత సిగరెట్ కంపెనీలపై పన్ను భారం భారీగా పెరిగింది. ప్రస్తుతం సిగరెట్లపై 40% జీఎస్‌టీతో పాటు, ప్రతి వెయ్యి స్టిక్స్‌పై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ముఖ్యంగా 75-85 ఎంఎం పరిమాణం గల సిగరెట్ల తయారీ వ్యయం 22 నుంచి 28 శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ అదనపు భారాన్ని వినియోగదారులపైకి మళ్లించడం ద్వారా తమ లాభాలను కాపాడుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి.

ఏ బ్రాండ్ ఎంత పెరగవచ్చు?

ధరల పెంపు కేవలం ప్రీమియం బ్రాండ్లకే పరిమితం కాకుండా, తక్కువ ధరకు దొరికే లోకల్ బ్రాండ్లపై కూడా పడనుంది. ఉదాహరణకు, మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఐటీసీ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ప్యాకెట్ ధర ప్రస్తుతం రూ.115 వరకు ఉంటే, మే 2026 నుంచి అది రూ.135 మార్కును దాటే అవకాశం ఉంది. అంటే కేవలం ఒక్క నెల వ్యవధిలో ప్యాకెట్‌పై రూ.20 వరకు భారం పడనుంది. ఇతర బ్రాండ్లపై కూడా సుమారు 10 నుంచి 17 శాతం వరకు పెంపు ఉండవచ్చని సమాచారం.

స్టాక్ మార్కెట్లో సిగరెట్ కంపెనీల హంగామా

ధరలు పెరగనున్నాయనే వార్త బయటకు రాగానే స్టాక్ మార్కెట్లో సిగరెట్ కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ 29న ఐటీసీ షేర్లు 4 శాతం, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేర్లు ఏకంగా 6.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కూడా ఈ వార్తతో జోరుగా ట్రేడ్ అయింది. ధరలు పెరిగితే ప్రారంభంలో అమ్మకాలు కొద్దిగా తగ్గినా, ఆ తర్వాత వినియోగదారులు అలవాటు పడతారని, దీనివల్ల కంపెనీల లాభాలు పెరుగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.

ముందుముందు మరిన్ని వాతలు?

తయారీ ఖర్చులు, రవాణా చార్జీలు, ప్రభుత్వ పన్నుల ఒత్తిడి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సిగరెట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ధూమపానం చేసేవారిపైనే కాకుండా, దీనిపై ఆధారపడే చిల్లర వ్యాపారుల వ్యాపారంపై కూడా ఈ ధరల పెంపు ప్రభావం చూపనుంది. మొత్తానికి మే నెల నుంచి దమ్ము కొట్టాలంటే దమ్మిడీలు ఎక్కువే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story